తిరుమలగిరి (తుంగతుర్తి): మహిళల ఆరోగ్యానికి భరోసానిచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మహిళలకు పౌష్టికాహారం, ఆరోగ్యం, చేతుల శుభ్రతపై అవగాహన కల్పించేందుకు ఫుడ్ సైన్స్ అండ్ హ్యూమన్ వెల్‌నెస్ (ఎఫ్‌ఎస్‌హెచ్‌డబ్ల్యూ) పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కొన్నిరోజులుగా జిల్లాలోని స్వయం సహాయక సంఘా(ఎస్‌హెచ్‌జీ)లలోని సభ్యులైన మహిళలకు పౌష్టికాహారం, ఆరోగ్య రక్షణపై అవగాహన కల్పిస్తున్నారు.
అవగాహన ఎందుకంటే..
మహిళలు ఆర్థికంగా వృద్ధి చెందాలంటే సంపూర్ణ ఆరోగ్యవంతులై ఉండాలి. అప్పుడే వారిలో పని సామర్థ్యం పెరిగి ఎంచుకున్న రంగాల్లో మెరుగైన ఉత్పత్తి సాధిస్తారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక మంది మహిళలు స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)సభ్యులుగా కొనసాగుతున్నారు. వీరంతా ఆర్థికంగా ఎదగాలంటే మొదట పేదరికాన్ని జయించాలి. ఆరోగ్యంగా ఉంటేనే సంపద సృష్టి సాధ్యమవుతుంది. ఒకవేళ అనారోగ్యానికి గురైతే వైద్యానికే సంపాదనలో అగ్రభాగం ఖర్చవుతుంది. ఈ పరిస్థితిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం మహిళలు ఆహారంతో పాటు ఆరోగ్యంపై శ్రద్ధ వహించేలా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
పోషకాహార లోపాన్ని అధిగమించేలా..
గ్రామీణ ప్రాంతంలో ప్రతి పది మందిలో నలుగురు మహిళలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ కారణంగా తరచూ వారిని అనారోగ్యసమస్యలు బాధిస్తున్నాయి. ఈ పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ఆరోగ్య సంరక్షణ, పౌష్టికాహారం తయారీపై స్వయం సహాయక సంఘాల సభ్యులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఈ సమావేశంలో పౌష్టికాహారం, ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను వివరిస్తున్నారు. దీంతో పాటు పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత, పారిశుద్ధ్యంపైనా అవగాహన పెంపొందిస్తున్నారు.
జాతీయజెండా రంగులే ఆహార ఎజెండా..
జాతీయజెండాలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు ఉన్నాయి. ఆయా వర్ణాలలోని ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా మహిళలు తమ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు. దీంట్లో భాగంగా కాషాయం రంగులో ఉండే గుమ్మడి, బెల్లం, నారింజ, క్యారట్, పప్పు, బీట్ రూట్, దానిమ్మ తినాలి. అలాగే తెలుపు రంగులోని బియ్యం, జొన్నలు, సజ్జలు, అటుకులు, చిరు ధాన్యాలు, కోడి గుడ్డు తినాల్సి ఉంది. ఇంకా ఆకు పచ్చ రంగులో లభించే కాయగూరలు, మునగ, కాకర, సోర మొదలైన వాటితో పాటు పప్పులు, కంది, వేరుశనగ, బాదం, జీడి పప్పు, శనగలు ఆహారంగా తీసుకోవాలి.
ఫ ఎఫ్‌ఎస్‌హెచ్‌డబ్ల్యూ పేరుతో పోషకాహారంపై అవగాహన
ఫ స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రత్యేకం
ఫ గ్రామాల్లో కొనసాగుతున్న అవగాహన కార్యక్రమాలు
స్వయం సహాయక
సంఘాలు
17,669
సంఘ బంధాలు579
సభ్యులు
1,84,281