సూర్యాపేటటౌన్ : ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ముగిశాయి. ఈ నెల 6వ తేదీ నుంచి 32 కేంద్రాల్లో ప్రారంభమైన ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారంతో పరిసమాప్తం అయ్యాయి.చివరి రోజు కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు నిర్వహించారు. జనరల్ విభాగంలో మొత్తం 6,082 మంది విద్యార్థులకు గాను 5,893 మంది హాజరు కాగా 189 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1,184 మంది విద్యార్థులకు గాను 1,084 మంది హాజరు కాగా 100 మంది గైర్హాజరయ్యారు. పలు సెంటర్లలో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ 11 మంది విద్యార్థులు బోర్డు స్క్వాడ్‌కు దొరకడంతో వారిని డీబార్ చేసినట్టు డీఐఈఓ భానునాయక్ తెలిపారు.
గృహ ప్రవేశాలకు
సిద్ధం చేయాలి
సూర్యాపేట : సూర్యాపేట మండలం కేసారం–2 వద్ద గల డబుల్ బెడ్‌రూం ఇళ్లను ఏప్రిల్ రెండో వారంలోగా గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. గురువారం కేసారం–2 వద్ద కొనసాగుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. 480 ఇళ్ల పనులను 20 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట ఆర్డీఓ వేణుమాధవ్, తహసీల్దార్ శ్యాంసుందర్ రెడ్డి, ఆర్‌అండ్‌బీ డీఈ పవన్ కుమార్ పాల్గొన్నారు.
మహిళా కాంగ్రెస్ రాష్ట్ర
ఉపాధ్యక్షురాలిగా రేఖ
అర్వపల్లి: మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా జాజిరెడ్డిగూడెం మండలం అడివెంల గ్రామానికి చెందిన డాక్టర్ బోయలపల్లి రేఖ నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని గురువారం హైదరాబాద్‌లో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీతారావు నుంచి అందుకున్నారు. కాగా రేఖ ఇప్పటికే రేఖ చారిటబుల్ ఫౌండేషన్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రేఖ మాట్లాడుతూ తన నియామకానికి కృషి చేసిన జాతీయ అధ్యక్షురాలు అల్క లాంబ, రాష్ట్ర అధ్యక్షురాలు సునితారావులకు కృతజ్ఞతలు తెలిపారు.
గోదావరి జలాలు
మరింత పెంపు
అర్వపల్లి: యాసంగి సీజన్‌కు చివరి విడతగా జిల్లాకు విడుదల చేస్తున్న గోదావరి జలాలను మరింత పెంచారు. 1,429క్యూసెక్కులు వస్తుండగా వాటిని 1,650 క్యూసెక్కులకు పెంచారు. ఇందులో 69డీబీఎంకు 500, 70డీబీఎంకు 70, 71 డీబీఎంకు 1,080 క్యూసెక్కుల చొప్పున నీటిని వదులుతున్నట్లు నీటి పారుదలశాఖ డీఈఈ ఎం. సత్యనారాయణ తెలిపారు.
ముగిసిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు