
ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డీఏలు ప్రకటించాలి
సూర్యాపేటటౌన్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డీఏలను వెంటనే ప్రకటించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ ప్రభుత్వాన్ని చేశారు. టీఎస్ యూటీఎఫ్ సూర్యాపేట జిల్లా కమిటీ సమావేశాన్ని ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు ఎన్. సోమయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి అలుగుబెల్లి నర్సిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న సప్లమెంటరీ బిల్లులను మార్చి నెల చివరి నాటికి చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు, ప్రాథమిక విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు గాను మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లోని ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేసి మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని కోరారు. ప్రతి తరగతికి 20 మంది విద్యార్థులు, ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండేలా, ప్రధానోపాధ్యాయులు అదనంగా ఉండేలా తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను నిర్వహించాలన్నారు. డిటెన్షన్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయకూడదని సూచించారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్. రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. అనిల్‌కుమార్, అరుణభారతి, జి. వెంకటయ్య, నాగేశ్వరరావు, బి. ఆడం, బి. రమేష్, డి. శ్రీనివాసాచారి, ఎన్. వెంకటేశ్వర్లు, ఆర్. శీనయ్య, అభినవ్, ఆర్. శ్రీను, పి. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.