సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవికి లైన్ క్లియర్ అయినట్లు తెలిసింది. దీంతో జిల్లాకు మరో మంత్రి పదవి దక్కబోతోంది. మంత్రివర్గ విస్తరణపై సోమవారం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, భారీ నీటి పారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించారు. ఇందులో రాజగోపాల్‌రెడ్డికి మంత్రి ఇచ్చేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. మరోవైపు దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌కు డిప్యూటీ స్పీకర్ పదవితోపాటు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తనకు మంత్రి పదవి వస్తుందన్న ఆశతో రాజగోపాల్‌రెడ్డి ఉన్నారు. అయితే, వివిధ కారణాలతో అది వాయిదా పడుతూ వచ్చింది. దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌కు కూడా మంత్రి పదవి వస్తుందన్న నమ్మకంతో ఆయన అనుచరులు ఉన్నారు. అయితే, రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వబోతున్నందున బాలు నాయక్‌కు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారన్న చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మంత్రి పదవులు ఉండగా, మూడో మంత్రి పదవి రాజగోపాల్‌రెడ్డికి దక్కనుంది. ఉగాదికి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఫ ఉమ్మడి జిల్లాకు మూడో మంత్రి
ఫ బాలునాయక్‌కు డిప్యూటీ స్పీకర్
ఫ ఢిల్లీ చర్చల్లో దాదాపుగా ఖరారు
రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి!