
ఘనంగా సహస్రకలశాభిషేకం
మేళ్లచెరువు : మేళ్లచెరువు మండల కేంద్రంలోని మైహోమ్ సిమెంట్ పరిశ్రమలో నిర్వహిస్తున్న శ్రీదేవిభూదేవి శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సహస్రకలశాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్‌స్వామి పర్యవేక్షణలో వెయ్యిన్నొకటి (1001) కలశాలతో సుగంధ ద్రవ్యాలు, కర్పూరం, పంచామృతంతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఈ నెల 19 న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిసినట్లు పేర్కొన్నారు. అనంతరం జీయర్‌స్వామి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో మొట్టమొదటి సారిగా ఏకోత్తర సహస్ర అభిషేక మహోత్సవం నిర్వహించారని ఈ అభిషేక తీర్థం ఎన్నో గొప్పఫలితాలు ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మైహోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, శ్రీకుమారి దంపతులు, మునగాల రామ్మోహనరావు, అరుణ దంపతులు, జూపల్లి వినోద్‌రావు, భార్గవి దంపతులు, రంజిత్‌రావు, యూనిట్ హెడ్ శ్రీనివాసరావు, ఉద్యోగులు పాల్గొన్నారు.