కలెక్టర్‌కు రిపోర్టు ఇచ్చాం..
ప్రస్తుతం 30 పడకల వైద్యశాల ఆవరణలోనే వంద పడకల వైద్యశాల నిర్మించాలని నిర్ణయిచండంతో ఎంత స్థంలం ఉందనే విషయంపై కలెక్టర్ ఆదేశాలతో ఉన్నతాధికారుల సమక్షంలో సర్వే చేశాం. కాంపౌండ్‌లోపల 1.25 ఎకరాలు మాత్రమే ఉందని తేలింది. ఇది వైద్యశాల నిర్మాణానికి సరిపోతుందని కలెక్టర్‌కు నివేదిక ఇచ్చాం.
– సూర్యనారాయణ, ఆర్డీఓ కోదాడ
ఫ కోదాడలో వంద పడకల ఆసుపత్రికి
శాపంగా మారిన స్థల సర్వేలు
ఫ ఒకే స్థలంపై పది రకాల రిపోర్టులు
ఫ వాస్తవాలను దాచి కోర్టులను
తప్పుదోవ పట్టిస్తున్న వైనం
ఫ జిల్లా కలెక్టర్ ఆదేశంతో మళ్లీ సర్వే
కోదాడ: కోదాడ పట్టణంలో వంద పడకల వైద్యశాల నిర్మాణానికి ప్రభుత్వ సర్వేయర్ల తీరు శాపంగా మారింది. దాత ఇచ్చిన స్థలం విషయంలో ఆయన వారసులు వేసిన కేసులకు విడతకు ఒక రకంగా సర్వే చేసి కొలతలు ఇస్తుండడంతో వంద పడకల వైద్యశాల నిర్మాణానికి ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోతున్నారు. తాజాగా నెల రోజుల క్రితం ఐదుగురు అధికారుల బృందం వైద్యశాల స్థలాన్ని సర్వే చేయగా దాత ఇచ్చిన దానికంటే తక్కువగా ఉందని రిపోర్టు ఇచ్చింది. దీంతో దాత ఇచ్చిన స్థలాన్ని పూర్తిస్థాయిలో ఎంజాయ్‌మెంట్ సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించడంతో రెండు రోజులుగా అధికారులు మళ్లీ సర్వే చేస్తున్నారు.
ఇచ్చింది రెండెకరాలైతే..
ఉన్నది 1.25 ఎకరాలు మాత్రమే..
కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు 1963లో దానపత్రం ద్వారా కోదాడకు చెందిన నాగుబండ పద్మయ్య సర్వే నంబర్ 149లో రెండు ఎకరాల భూమిని రాసి ఇచ్చారు. వైద్యశాలకు తూర్పు వైపు అప్పటికే ఉన్న డొంక రోడ్డును 30 అడుగుల రోడ్డుగా, పడమర వైపు ఎన్‌ఎస్‌పీ–వైద్యశాల మధ్య 30 అడుగుల రోడ్డును తీశారు. తూర్పు రోడ్డు నుంచి సర్వే నంబర్ 149లో మిగిలిన భూమిలోకి వెళ్లడానికి దారిగా దాత వారసులే ఉపయోగించుకోవడంతోపాటు తమ భూమిని ప్లాట్లుగా చేసి అమ్ముకున్నారు. తాజాగా కోదాడ 30 పడకల వైద్యశాలను వంద పడకల వైద్యశాలగా మార్చి నూతన భవన నిర్మించాలని నిర్ణయించారు. దీని కోసం ఇటీవల ఐదుగురు అధికారులు స్థలాన్ని కొలిచారు. కాంపౌండ్ లోపల కేవలం 1.25 ఎకరాలు మాత్రమే ఉందని తేల్చారు. మిగతా 15 గుంటలు ఏమైందో పట్టించుకోకుండా ఉన్న స్థలంలోనే వైద్యశాల కట్టొచ్చని సలహా ఇచ్చారు.
ఆక్రమించి కాంపౌండ్
వాల్ నిర్మించారని కేసు
2002–03లో తన స్థలాన్ని వైద్యశాల అధికారులు 23 గుంటలు ఆక్రమించి కాంపౌండ్ వాల్ పెట్టుకున్నారని దాత వారసుడు రాష్ట్ర హైకోర్టులో కేసు వేశారు. కాంపౌండ్ లోపల కొలిచి ఎక్కువ ఉంటే ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాంపౌండ్ లోపల కొలవాల్సి ఉన్నా.. రోడ్డును కూడా వైద్యశాల స్థలంగా కొలిచి 530 గజాలు ఎక్కువ ఉందని తేల్చి కోర్టు ఆదేశాలతో దాన్ని దాత వారసుడికి ఇచ్చారు. దీనిపై వైద్య విధాన పరిషత్ కమిషనర్ జిల్లా కలెక్టర్‌కు డీవో లెటర్ రాశారు. వైద్యశాల కాంపౌండ్ లోపల రెండెకరాలకు 10 గుంటలు తక్కువగా ఉందని చెప్పారు. దీంతో కలెక్టర్ స్పందించి మరోసారి సర్వే చేయించారు. 10 గుంటలు తక్కువగా ఉండడంతో గతంలో ఇచ్చిన 530గజాలప్రొసీడింగ్స్‌ను రద్దు చేశారు.
తాను లేకుండా కొలిచారని మరో కేసు
రెండోసారి స్థలం కొలిచినప్పుడు తాను లేనని అందువల్ల మరోసారి స్థలాన్ని కొలవాలని దాత వారసుడు కోర్టుకు వెల్లడంతో 2012లో స్థలాన్ని కొలిచిన సర్వేయర్లు ఈ సారి రెండెకరాలకు 565 గజాలు ఎక్కువ ఉందని తేల్చారు. దీంతో అప్పటి అధికారులు 500 గజాలు ఇస్తాం.. కేసులన్నీ వెనక్కితీసుకోవాలని దాత వారసుడితో ఒప్పందం కుదుర్చుకొని అతడికి వైద్యశాల కాంపౌండ్ లోపల 500 గజాలు ఇచ్చారు. వాస్తవానికి వైద్యశాల తూర్పువైపు రోడ్డు తనదేనని గతంలో సూర్యాపేట సబ్‌కోర్టులో కేసు వేసిన దాత వారసుడు ఈ కేసులో ఓడిపోవడంతో పాటు తప్పుడు కేసు వేసినందుకు కోర్టు జరిమానా విధించింది. దీన్ని దాచి ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించి వైద్యశాల స్థలాన్ని దొడ్డిదారిన కాజేశారని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే గతంలోనే రెవెన్యూ అధికారులు కాసులకు కక్కుర్తిపడి దాత వారసులకు ఇక్కడ భూమి ఉందని తప్పుడు పాసుపుస్తకాలు జారీ చేయడంతో వాటిని అడ్డుపెట్టుకొని ప్రభుత్వ స్థలాన్ని కాజేయడానికి వారసులు పది సార్లు కోర్టులో 20 రకాల కేసులు వేశారు.