
48 గంటల్లోనే ధాన్యం డబ్బులు జమ చేస్తాం
భానుపురి: ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ పి.రాంబాబు అన్నారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్‌లో యాసంగి (2024–25) ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం వడ్లకు మద్దతు ధర రూ.2,320తోపాటు క్వింటాపై రూ.500 బోనస్ ప్రభుత్వం ఇస్తుందన్నారు. జిల్లాలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో 127, ఐకేపీ ఆధ్వర్యంలో 137, మెప్మా ఆధ్వర్యంలో 12, ఎఫ్‌పీఓ 10, మొత్తం 286 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఓ వీవీ.అప్పారావు, మార్కెటింగ్ అధికారి నాగేశ్వరశర్మ, జిల్లా సహకార అధికారి పద్మ, మెప్మా పీడీ రేణుక, ఏఎస్‌ఓ శ్రీనివాస్‌రెడ్డి, ఏడీ ఎం.బెనర్జీ, పీఏసీఎస్ అధికారులు, ఐకేపీ నిర్వాహకులు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.