
గోదావరి జలాల పెంపు
అర్వపల్లి: యాసంగి సీజన్‌కుగాను జిల్లాకు అదనంగా మరో విడత గోదావరి జలాలను బుధవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తొలిరోజు 1000 క్యూసెక్కుల నీటిని వదలగా గురువారం 1,325 క్యూసెక్కులకు పెంచారు. మూడో సారి శుక్రవారం 1,510 క్యూసెక్కులకు పెంచినట్లు బయ్యన్నవాగు డీఈఈ సత్యనారాయణ తెలిపారు. ఈ నీటిని 69,70,71 డిస్ట్రిబ్యూటర్లకు వదులుతున్నట్లు పేర్కొన్నారు. నీళ్లు చివరి భూములకు చేరడానికే పెంచినట్లు తెలిపారు. రైతులు కాలువలకు గండ్లు పెట్టకుండా, నష్టం కలిగించకుండా గోదావరి జలాలను వాడుకోవాలని సూచించారు.
తోటివారితో ప్రేమ
పూర్వకంగా ఉండాలి
మఠంపల్లి: క్రైస్తవులంతా తోటి వారితో ప్రేమ పూర్వకంగా జీవించాలని నల్లగొండ మేత్రాసన పీఠాధిపతి (బిషప్) కరణం ధమన్‌కుమార్ అన్నారు. శుక్రవారం మఠంపల్లిలోని శుభవార్త చర్చిలో జూబ్లీ ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై దివ్యబలిపూజ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. 2025 సంవత్సరాన్ని జూబ్లీగా పోపు ప్రకటించారని తెలిపారు. గతనెల 5నుంచి ఈనెల 18న జరగనున్న గుడ్‌ఫ్రైడే వరకు ఉపవాస దీక్షల్లో ఉన్న క్రైస్తవులకు అత్యంత విలువైన కాలమని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విచారణ గురువులు, చర్చి కమిటీ పెద్దలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో రెవరెండ్ ఫాదర్లు మార్టిన్, బాల, సాగర్, చిన్నపరెడ్డి, క్రీస్తురాజు పాల్గొన్నారు.
వ్యవసాయ మార్కెట్‌కు రెండు రోజులు సెలవు
తిరుమలగిరి: తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు శనివారం మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావ్ జయంతి, ఆది వారం వారాంతం సందర్భంగా రెండు రోజులు మార్కెట్‌కు సెలవు ఉంటుందని వ్యవసాయ మార్కెట్ ఇన్‌చార్జ్ కార్యదర్శి సురేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని తీసుకురావొద్దని కోరారు. తిరిగి వ్యవసాయ మార్కెట్ సోమవారం యథావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు.
సీఎంఆర్ ఇచ్చిన మిల్లర్లకే ధాన్యం కేటాయింపు
భానుపురి (సూర్యాపేట): సీఎంఆర్ బకాయి పూర్తి చేసిన మిల్లర్లకే 2024– 25 రబీ సీజన్ ధాన్యం కేటాయించనున్నట్లు అదనపు కలెక్టర్ రాంబాబు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సివిల్ సప్లయ్ అధికారులు, మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2022–23 రబీ సీజన్, 2024–25 ఖరీఫ్ సీజన్ సీఎంఆర్ బకాయిలను త్వరగా పూర్తి చేయాలన్నారు. బ్యాంకు గ్యారంటీ ఉన్న మిల్లర్లకు మాత్రమే 2024–25 ఖరీఫ్ సీజన్ ధాన్యం కేటాయిస్తామని, వేలం వేసిన ధాన్యం బకాయిలు కూడా త్వరగా చెల్లించాలన్నారు. మిల్లులకు వచ్చిన ధాన్యం పెండింగ్ ఉంచకుండా వెంటనే దిగుమతి చేసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా సివిల్ సప్లయ్ అధికారి రాజేశ్వర్, డీఎం ప్రసాద్, ఏఎస్‌ఓ శ్రీనివాసరెడ్డి, డీటీలు, మిల్లర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

గోదావరి జలాల పెంపు