
పత్తి రైతుపై విత్తన భారం!
భానుపురి: పత్తి రైతుల కష్టాలు అన్నీఇన్నీ కావు. విత్తనాలు నాటింది మొదలు పత్తి దిగుబడి చేతికొచ్చి అమ్మేదాకా ఇబ్బందులే ఎదురవుతున్నాయి. రానున్న వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే పత్తి విత్తనాల కంపెనీలు విత్తన ధరలను పెంంచేశాయి. దీంతో రైతులపై ఆర్థిక భారం మరింత పెరగనుంది. ఫలితంగా ఇప్పటికే ఏటేటా తగ్గుతూ వస్తున్న పత్తి సాగువైపు ఈసారి రైతులు మొగ్గు చూపుతారా..అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ధరలు ఏటా పెంచుతుండగా నకిలీ విత్తనాల బెడద రైతులను తీవ్రంగా నష్టాల పాలుచేస్తోంది.
ఏటేటా పెరుగుతున్న విత్తన ధరలు
రైతులకు ఏటేటా పత్తి సాగుకు పెట్టుబడులు పెరుగుతున్నాయి. సాగు ఖర్చులతోపాటు విత్తనాలు, పురుగు మందులకు రూ.వేల్లో పెట్టుబడులు పెడుతున్నారు. దీనికి తోడుగా కూలీల ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఎకరానికి రూ.10 నుంచి రూ.12వేల వరకు కలుపుతీత కోసమే ఖర్చు చేయాల్సి వస్తోంది. విత్తన కంపెనీలు ఏటా ధరలు పెంచుతుండడంతో రైతులపై ఆర్థిక భారం పడుతోంది. బీటీ పత్తి విత్తనాల ధర ఆరేళ్లుగా పెరుగుతూనే ఉన్నాయి. 2019లో పత్తి ప్యాకెట్ ధర రూ.710 ఉండగా ప్రస్తుతం రూ.901కు చేరింది.
ఎకరాకు మూడు ప్యాకెట్లు అవసరం
జిల్లాలో వరి తర్వాత పత్తి సాగే అధికంగా ఉంటుంది. 8ఏళ్ల క్రితం దాదాపు 2 లక్షల ఎకరాల వరకు పత్తి సాగు ఉండేది. కొన్నేళ్లుగా కాలం కలిసి రావడం, ఎస్సారెస్సీ నీళ్లు జిల్లాకు అందుతుండడంతో రైతులు వరిసాగు వైపు మళ్లుతున్నారు. దీనికితోడు పత్తి ధర అంతంత మాత్రంగానే ఉంటుండడంతో ఏటా సాగు విస్తీర్ణం తగ్గుతోంది. గత వానాకాలంలో జిల్లాలో 80వేల ఎకరాల వరకు పత్తి సాగు జరిగింది. ఎకరాకు మూడు ప్యాకెట్ల చొప్పున విత్తనాలను విత్తుకోవాల్సి ఉండగా జిల్లాలో 2.40 లక్షల ప్యాకెట్ల పత్తి ప్యాకెట్లు అవసరమవుతాయి. ఒక్కో ప్యాకెట్ 475 గ్రాములు ఉంటుండగా ఇందులో 450 గ్రాముల బీటీ, 25 గ్రాముల నాన్‌బీటీ విత్తనాలు ఉంటాయి. రైతులు పూర్తిగా బీటీ విత్తనాలే వాడుకుంటారు.
పెట్టుబడులు అధికమవుతున్నాయి
పత్తి విత్తనాల కొనుగోలు నుంచి చేతికొచ్చిన పంట అమ్మకం దాకా రైతుల చేతిలో ఏదీ ఉండడం లేదు. ఏటా విత్తన ధరలను కంపెనీలు పెంచుతున్నాయి. ఇతరత్రా ఖర్చులు అధికంగానే పెరుగుతుండడంతో పత్తి సాగు చేసే పరిస్థితి లేదు.
– గుద్దేటి జాన్‌రెడ్డి, రైతు, ఆత్మకూర్(ఎస్)
ధరలను తగ్గించాలి
పత్తి విత్తనాల ధరలను ఏటా పెంచుతుండంతో రైతులపై ఆర్థిక భారం పడుతోంది. పెంచిన ధరలను కంపెనీలు వెంటనే తగ్గించాలి. లేదంటే ప్రభుత్వం పత్తి విత్తనాలపై రాయితీ ఇవ్వాలి. పత్తి సాగు చేస్తే పెట్టుబడులు చేతికి వచ్చే పరిస్థితి లేదు.
– ఉప్పుల మల్లయ్య, రైతు, ఆత్మకూర్(ఎస్)
పత్తి విత్తన ప్యాకెట్ల ధరలు పెంచిన కంపెనీలు
ఫ ఇప్పటికే అధిక పెట్టుబడులతో
కుదేలవుతున్న రైతాంగం
ఫ దిగుబడులు సైతం తగ్గి ఆర్థికంగా
నష్టపోతున్న వైనం
ఫ జిల్లాలో ఏటా 80వేల ఎకరాల్లో పత్తిసాగు
పత్తి విత్తన ప్యాకెట్ల
ధరలు ఇలా..
(రూపాయల్లో..)
2019 710
2020 730
2021 767
2022 810
2022 853
2023 864
2024 864
2025 901

పత్తి రైతుపై విత్తన భారం!

పత్తి రైతుపై విత్తన భారం!

పత్తి రైతుపై విత్తన భారం!