
మైనార్టీ గురుకులాల్లో వసతులు కరువు
● ఉమ్మడి జిల్లాలో మొత్తం
14 మైనార్టీ గురుకులాలు
● అందులో 13 గురుకులాలు
అద్దె భవనాల్లో కొనసాగుతున్న వైనం
● అరకొర సౌకర్యాలతో ఇబ్బందులు పడుతున్న విద్యార్ధులు
చౌటుప్పల్ రూరల్: మైనార్టీ గురుకులాల్లో విద్యార్థులకు అత్యుత్తమ విద్యాబోధన జరుగుతుందని ప్రభుత్వం చెప్పుకుంటున్నా.. చాలా గురుకులాల్లో సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా చాలా మైనార్టీ గురుకుల పాఠశాలలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో ఒక్క గురుకులానికే
సొంత భవనం..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 14 మైనార్టీ గురుకులాలు ఉన్నాయి. ఇందులో కేవలం నల్లగొండ పట్టణంలో ఉన్న బాలుర మైనార్టీ గురుకులానికి మాత్రమే సొంత భవనం ఉంది. మిగతా 13 గురుకులాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో బాలికల మైనార్టీ గురుకుల పాఠశాల, చౌటుప్పల్, భువనగిరిలో బాలుర మైనార్టీ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటికి నెలకు సుమారు రూ.3.5 లక్షలు అద్దె చెల్లిస్తున్నారు.
వసతుల్లేక ఇబ్బందులు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న మైనార్టీ గురుకులాల్లో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. అద్దె భవనాల్లో విద్యార్థులకు సరైన వసతులు లేవు. చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో గల మైనార్టీ గురుకుల పాఠశాల మూతపడిన పరిశ్రమ షెడ్‌లో కొనసాగుతోంది. డార్మిటరీ లేక రేకుల షెడ్‌లోనే సుమారు 320 మంది విద్యార్థులు నిద్రిస్తున్నారు. అంతేకాకుండా పెద్ద రేకుల షెడ్‌ను గదులుగా విభజించి తరగతులు నిర్వహిస్తున్నారు. బాత్రూంలు కూడా సరిపడా లేవు, భోజనం చేయడానికి రేకుల షెడ్‌లోనే డైనింగ్ హాల్ ఏర్పాటుచేశారు. అరకొర సౌకర్యాలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇంటిగ్రేటెడ్ గురుకులాల్లో విలీనం చేసేనా..
రాష్ట్ర ప్రభుత్వం 28 నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న సమీకృత గురుకులాల్లో మైనార్టీ గురుకులాలను కూడా విలీనం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరు, భువనగిరిలో నిర్మిస్తున్న సమీకృత గురుకులాల్లోకి ఆయా ప్రాంతాల్లో ఉన్న మైనార్టీ గురుకులాలు విలీనం అయ్యే అవకాశం ఉంది. ఇక మునుగోడు నియోజకవర్గంలో ఉన్న చౌటుప్పల్ మైనార్టీ గురుకుల పాఠశాలను మునుగోడు మండలం కలకుంట్లలో నిర్మిస్తున్న సమీకృత గురుకులంలో విలీనం చేస్తారని సమాచారం. సమీకృత గురుకులాల్లో మైనార్టీ గురుకులాలను విలీనం చేయకపోతే మైనార్టీ గురుకుల పాఠశాలలకు ప్రభుత్వ స్థలాలను కేటాయించి సొంత భవనాలు నిర్మించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

మైనార్టీ గురుకులాల్లో వసతులు కరువు

మైనార్టీ గురుకులాల్లో వసతులు కరువు