
ధాన్యం ట్రాక్టర్ల బారులు
నేరేడుచర్ల: రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోవడానికి నేరేడుచర్లలో కమీషన్ ఏజెంట్లను ఆశ్రయించారు. దీంతో వారి దుకాణాల వద్ద ధాన్యం ట్రాక్టర్లు బారులుదీరాయి. పట్టణంలోని హుజూర్‌నగర్ రోడ్డు, జాన్‌పహాడ్ రోడ్డులో వందలాది ధాన్యం ట్రాక్టర్లు నిల్చున్నాయి. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈనెల 8న స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసింది. కొనుగోలు కేంద్రంలో ఆరబెట్టిన ధాన్యాన్ని మాత్రమే ఖరీదు చేస్తుండటంతో రైతులు కమీషన్ ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పినా పచ్చి ధాన్యం అమ్ముకునేందుకు మొగ్గు చూపుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరబోసేందుకు సరైన స్థలం లేకపోవడం, బస్తాల కొరత ఉండటంతో రైతులు దళారులు, మిల్లర్లను ఆశ్రయిస్తున్నారు. వీరు వారం రోజుల క్రితం రూ.2500 కొనుగోలు చేయగా ప్రస్తుతం రూ. 2200 నుంచి రూ.2250 వరకు కొనుగోలు చేస్తున్నారు.