
ఏదీ సౌకరా్యల జాడ!
కోదాడ: కోదాడ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి 20 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పారిశ్రామిక వాడ (ఇండస్ట్రీయల్ పార్క్) పరిస్థితి మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కి అనే చందంగా మారింది. పారిశ్రామిక వాడలో కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని తక్కువ రేట్లకు స్థలాలు దక్కించుకున్నవారు అటువైపు చూడకపోవడంతో పారిశ్రామిక వాడ కంపచెట్లతో దర్శనమిస్తోంది. చీకటి పడిందంటే అటువైపు వెళ్లడానికి భయపడే పరిస్థితి నెలకొంది. జాతీయ రహదారి పక్కన ఉండే ఈ పారిశ్రామిక వాడ అభివృద్ధిపై ఉన్నతాధికారులు దృష్టి సారించడం లేదు. 20 ఏళ్లలో భారీ, చిన్న తరహా పరిశ్రమలు అన్నీ కలిపి ఇప్పటి వరకు 20 నుంచి 30 మాత్రమే ఇక్కడ ఏర్పాటు అయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు
జాతీయ రహదారి పక్కన 61 ఎకరాలు..
కోదాడ మండల పరిధిలోని దోరకుంట వద్ద 2005లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ).. ప్రస్తుతం టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో కోదాడ పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి పక్కన రూ.44.73 లక్షలతో 61 ఎకరాల భూమిని సేకరించారు. దీన్ని లేఅవుట్ చేసి రోడ్లను ఏర్పాటు చేశారు. విద్యుత్ సౌకర్యం కల్పించారు. పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చేవారికి స్థలాలు కూడా కేటాయించారు. 2006 నుంచే పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని స్థలాలు తీసుకున్నవారు నేటికీ పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. ఇక్కడ 200 వరకు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్నా గత 20 సంవత్సరాల్లో కేవలం 20 నుంచి 30 వరకు మాత్రమే పరిశ్రమలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 119 మంది పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని దరఖాస్తు చేయగా వారికి స్థలం కేటాయించారు.
స్థలం కోదాడలో..
కార్యాలయం వరంగల్‌లో..
కోదాడ పరిధిలో ఉన్న పారిశ్రామిక వాడకు సంబంధించిన ఏ సమాచారం కూడా ఇక్కడ దొరకడం లేదు. ఇది వరంగల్ రీజియన్ పరిధిలో ఉంది. దీంతో ఏ సమాచారం కావాలన్నా వరంగల్‌కు వెళ్లాల్సి వస్తోంది. రీజియన్ అధికారులు ఇక్కడికి సంవత్సరానికి ఒకసారి కూడా వస్తున్నారో లేదో తెలియని పరిస్థితి. స్థానికంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తే పారిశ్రామిక వాడ అభివృద్ధి చెందడంతో పాటు పలువురికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్థానికులు భావిస్తున్నారు.
సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలి
కోదాడ పరిధిలోని దోరకుంట పారిశ్రామికవాడలో కనీస సౌకర్యాలు లేవు. రోడ్లు గుంతలుపడి కంకర తేలాయి. కంపచెట్లు కమ్మేశాయి. కోదాడ దుర్గాపురం జంక్షన్ నుంచి పారిశ్రామికవాడ వరకు సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలి. ఇక్కడి నుంచి భారీ వాహనాలు ఐదు కిలోమీటర్లు ముందుకు వెళ్లి చిమిర్యాల క్రాస్ రోడ్డు నుంచి తిరిగి రావాల్సి వస్తోంది.
– ఏర్నెని బాబు, మాజీ సర్పంచ్, కోదాడ
ఫ 20 ఏళ్ల క్రితం దోరకుంట వద్ద ఏర్పాటు
ఫ దరఖాస్తు చేసుకున్నవారికి
స్థలం కేటాయింపు
ఫ ఇప్పటికీ పూర్తిస్థాయిలో
ఏర్పాటు కాని పరిశ్రమలు
ఫ మౌలిక వసతుల కల్పనలో
అధికారులు విఫలం
కనీస సౌకర్యాలు కరువు
పారిశ్రామిక వాడకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదు. 20 సంవత్సరాల క్రితం వేసిన రోడ్లపై కంకర తేలి నడవడానికి వీల్లేని పరిస్థితి నెలకొంది. వీధి దీపాలు వేసే దిక్కేలేదు. ఆ ప్రాతం మొత్తం కంపచెట్లు పెరిగి చీకటి పడితే వెళ్లడానికి భయపడే పరిస్థితి ఏర్పడింది. నీటి వసతి కూడా లేకపోవడంతో పరిశ్రమలు ఏర్పాటు కావడం లేదు. కోదాడలోని ఖమ్మం క్రాస్ రోడ్డులో అనేక ట్రాక్టర్ ట్రాలీ, ఇతర వ్యవసాయ పనిముట్లు, షట్టర్లు తయారు చేసే పరిశ్రమలు రోడ్డుమీదే ఏర్పాటు చేశారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. వీరందరికీ పారిశ్రామిక వాడలో స్థలాలు కేటాయించాలని పలువురు కోరుతున్నా అది కార్యరూపం దాల్చడంలేదు.

ఏదీ సౌకరా్యల జాడ!