
రాజ్యాంగం వల్లే అందరికీ హక్కులు
తాళ్లగడ్డ (సూర్యాపేట) : డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే సమాజంలో అందరూ హక్కులు, బాధ్యతలు, పదవులు పొందగలుగుతున్నారని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం సూర్యాపేట పట్టణంలో ఆయన విగ్రహానికి కలెక్టర్ తేజస్‌నందర్‌లాల్ పవార్, ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, మందుల సామేల్, ఎస్పీ నరసింహ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ సమాన విద్య , సమానత్వపు హక్కులు, ప్రాథమిక హక్కులన్నీ అంబేడ్కర్ రాజ్యాంగంలో రాసినవే అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ,బీసీ హక్కుల కోసం ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగమే దేశానికి శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల ఎత్తుగల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ యువత .. అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల కారణంగానే తాను ప్రజా ప్రతినిధి స్థాయికి ఎదిగానన్నారు. ఎస్పీ నర్సింహ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, అంటరానితనం నిర్మూలనకి అంబేడ్కర్ కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు, ఎస్సీ అభివృద్ధి అధికారి కె.లత, గిరిజన అభివృద్ధిశాఖ అధికారి శంకర్, డీఎంహెచ్‌ఓ కోటాచలం, డీఆర్‌డీఓ వివి.అప్పారావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్ నాయక్, టీఎన్‌జీఓ సంఘం సెక్రటరీ దున్న శ్యామ్, వివిధ సంఘాల నాయకులు చిన్న శ్రీరాములు, తప్పెట్ల శ్రీరాములు, అంజద్ అలీ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్
ఫ సూర్యాపేటలో
అంబేడ్కర్ జయంతి వేడుకలు
ఫ హాజరైన ఎమ్మెల్యేలు
జగదీష్‌రెడ్డి, సామేల్