
ఇందిరమ్మ ఇంటికి రుణం
భానుపురి (సూర్యాపేట) : పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రజా పాలనలో దరఖాస్తులు ఆహ్వానించి ఇటీవల మండలానికో గ్రామాన్ని ఎంపిక చేసింది. ఇక్కడ అర్హులైన నిరుపేదలకు ఇళ్లను మంజూరు చేసింది. మండలానికో మోడల్ ఇంటిని నిర్మిస్తున్నారు. కానీ లబ్ధిదారుల ఆర్థిక ఇబ్బందులు, ఇతర సమస్యల కారణంగా ఇప్పటి వరకు జిల్లాలో ఈ పథకం పనులు ప్రారంభం కాలేదు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చేలా ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న పేదలు దరఖాస్తు చేసుకుంటే రూ.లక్ష రుణం ఇవ్వాలని నిర్ణయించింది.
అంతంత మాత్రంగానే..
బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో డబుల్‌బెడ్ రూం ఇళ్ల నిర్మాణం గ్రామస్థాయిలో ఎక్కడా జరగలేదు. మున్సిపాలిటీల్లోనే నిర్మాణాలు చేపట్టగా ఇవి కూడా వెయ్యి దాటలేదు. ఈ పదేళ్ల కాలంలో ఎంతోమంది పేదలు ఇళ్ల కోసం ఆశగా ఎదురు చూశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో.. ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించి అధికారంలోకి వచ్చింది. ఈ సమయంలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించగా జిల్లావ్యాప్తంగా ఏకంగా 3,09,062 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరితో పాటు గ్రామసభల సమయంలోనూ మరో 28,225 దరఖాస్తులు అందాయి. రాష్ట్ర ప్రభుత్వం మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి 4,479 ఇళ్లను మంజూరు చేసింది. ఈ ఇళ్లను మంజూరు చేసి కూడా రెండునెలల కావొస్తున్నా లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముందుకు రావడం లేదు. ఇప్పటి వరకు కేవలం 623 ఇళ్లకు ముగ్గులు పోయగా మరో 136 ఇళ్లు బేస్‌మెంట్ లెవల్‌కు చేరాయి. భారీగా దరఖాస్తులు చేసుకున్నా.. ఇళ్ల నిర్మాణాల విషయంలో అంతంత మాత్రంగానే చేపట్టారు.
ఫ ఇల్లు నిర్మించుకోలేని స్థితిలో ఉన్న లబ్ధిదారులకు రూ.లక్ష రుణం
ఫ స్వశక్తి సంఘంలో సభ్యులుగా ఉన్నవారికి అవకాశం
ఫ ఊపందుకోనున్న ఇళ్ల నిర్మాణాలు
ఇందిరమ్మ ఇళ్ల పథకం వివరాలు..
వచ్చిన దరఖాస్తులు 3,37,287
మంజూరైన ఇళ్లు 4,479
ముగ్గు పోసినవి 623
బేస్‌మెంట్ లెవల్‌లో ఉన్నవి 136
ఆర్థిక సమస్యలతో..
లబ్ధిదారుడు సొంత ఖర్చులతో బేస్‌మెంట్ లెవల్ వరకు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పనులు పూర్తయితే ప్రభుత్వం లక్షరూపాయలను లబ్ధిదారుడి ఖాతాలో వేస్తోంది. ప్రస్తుతం చాలామంది లబ్ధిదారులు ఆర్థిక సమస్యల కారణంగా ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. గుడిసెలు, షెడ్లలో నివాసమున్నవారు వాటిని తొలగించి ఇళ్లు నిర్మించాలి. ఈ ఖర్చులను భరించలేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ప్రభుత్వ నిబంధనల మేరకు ఇళ్లను నిర్మించేందుకు మరికొందరు ఆసక్తిగా లేరు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆశించిన మేర జిల్లాలో ఇళ్ల నిర్మాణాలు సాగడం లేదు. ఈ ఆటంకాలను అధిగమించాలంటే ముందుగా ఆర్థిక సమస్యలతో ఉన్నవారికి ప్రభుత్వం తరఫున గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రుణం ఇప్పించాలని నిర్ణయించారు. లబ్ధిదారులు స్వశక్తి సంఘంలో సభ్యులై ఉండి రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే రూ.లక్ష వరకు పునాదుల వరకు అయ్యే ఖర్చు నిమిత్తం ఇవ్వనున్నారు.

ఇందిరమ్మ ఇంటికి రుణం