
పోలీస్ సిబ్బంది బాధ్యతతో పనిచేయాలి
పెన్‌పహాడ్: పోలీస్ సిబ్బంది బాధ్యతతో పనిచేయాలని ఎస్పీ నర్సింహ సూచించారు. బుధవారం పెన్‌పహాడ్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, పరికరాలు, వివిధ రకాల నేరాల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలు, ఫిర్యాదుల నమోదు, ప్రాథమిక దర్యాప్తు తదితర అంశాలను పరిశీలించారు. సిబ్బంది సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డయల్ 100ఫిర్యాదులు, పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలపై త్వరగా స్పందించాలని ఆదేశించారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పటిష్టంగా పని చేయాలన్నారు. గ్రామ పోలీసు అధికారి వ్యవస్థను ప్రణాళికతో అమలు చేయాలన్నారు. రోజూ గ్రామాలను సందర్శించి ప్రజలకు సన్నిహితంగా ఉంటూ పోలీసు సేవలను అందించాలన్నారు. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలు సీజ్ చేయాలన్నారు. గంజాయి రవాణా కేసుల్లో ఉన్న నిందితులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచి వారి కదలికలను నమోదు చేయాలన్నారు. పోలీసు ప్రజా భరోసా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తేవాలని, సామాజిక అంశాలను వివరించాలన్నారు. ఈకార్యక్రమంలో సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్‌ఐ గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
సాధారణ కాన్పులు పెంచాలి
అర్వపల్లి : ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు చేయించుకున్నవారికి పథకాలు వర్తిస్తాయని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటా చలం పేర్కొన్నారు.అర్వపల్లి పీహెచ్‌సీని బుధవారం ఆయన తనిఖీ చేసి రికార్డులు పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ కాన్పులు జరిగేలా గర్భిణులను వైద్య సిబ్బంది ప్రోత్సహించాలన్నారు. వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఎండల దృష్ట్యా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అన్ని గ్రామాల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఆయన వెంట మండల వైద్యాధికారి డాక్టర్ భూక్య నగేష్‌నాయక్, సీహెచ్‌ఓ ఎం. బిచ్చునాయక్, సూపర్‌వైజర్ లలిత, నర్సింగ్ అధికారిణి సునిత, కొమారి శైలజ ఉన్నారు.
భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక
హుజూర్‌నగర్ : భవన నిర్మాణ కార్మిక సంఘం (ఏఐటీయూసీ అనుబంధం) సూర్యాపేట జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు జడ శ్రీనివాస్ బుధవారం విలేకరులకు వెల్లడించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతలపాలెం మండలం దొండపాడులో జరిగిన మహాసభలో మంగళ వారం రాత్రి పొద్దు పోయిన తర్వాత జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా మేకల శ్రీనివాసరావు, అధ్యక్షుడిగా మారుడి శ్రీనివాస్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జెట్టి ప్రసాద్, ఉపాధ్యక్షులుగా షేక్ హుస్సేన్, విద్యాచారి, సహాయ కార్యదర్శిగా యడవెల్లి వెంకటేశ్వర్లు, కోశాధికారిగా సారెడ్డి రాఘవరెడ్డిలతో పాటు మరో 23 మంది కౌన్సిల్ సభ్యులను ఎన్నుకున్నట్లు వివరించారు.
న్యాయవాదిపై దాడిచేసిన వారిని శిక్షించాలి
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట పట్టణానికి చెందిన న్యాయవాది మంతాపురం కిషోర్‌పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు నూకల సుదర్శన్‌రెడ్డి, న్యాయవాదులు వసంత సత్యనారాయణపిళ్లై, బాణాల విజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం సూర్యాపేట జీజీహెచ్ వద్ద వారు విలేకరులతో మాట్లాడారు. కిశోర్‌కు చెందిన భూమి గాంధీనగర్‌లో ఉంది. తన భూమి వద్ద సర్వే చేస్తున్నారని తెలుసుకుని ఆయన వెళ్లారు. అక్కడే ఉన్న బుచ్చిరాములు, కొందరు వ్యక్తులు కలిసి కిశోర్‌పై దాడి చేశారని, దాడులకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని వారు కోరారు. సమావేశంలో అడ్వకేట్లు మాండ్ర మల్లయ్య, వీరేష్‌నాయక్, అబ్దుల్ లతీఫ్, కంచర్ల సతీష్, యాదగిరి, సందీప్, రాధాకృష్ణ, చంద్రకాంత్ ఉన్నారు.

పోలీస్ సిబ్బంది బాధ్యతతో పనిచేయాలి

పోలీస్ సిబ్బంది బాధ్యతతో పనిచేయాలి