మామిడి రైతు కుదేలు | - | Sakshi
Sakshi News home page

మామిడి రైతు కుదేలు

Apr 17 2025 1:51 AM | Updated on Apr 17 2025 1:51 AM

మామిడ

మామిడి రైతు కుదేలు

ఈదుగాలులు, వడగండ్ల వర్షానికి 3,092 ఎకరాల్లో నష్టం

కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

పదేళ్ల నుంచి మామిడిని కౌలుకి తీసుకొని సాగుచేస్తున్న. ఈ ఏడాది 35 ఎకరాలు తీసుకొని రూ.30లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. పూత సమయంలో తేనెమంచు తెగులు రావడంతో సరిగా కాత కాయలేదు. ఉన్న కాయ గాలిదుమారానికి రాలింది. ఇతర రాష్ట్రాల్లో టన్ను రూ.50వేలు ఉంటే మన దగ్గర దళారులు టన్ను రూ.20వేల నుంచి రూ.30వేలకు మించి పెట్టడం లేదు. ఈ ఏడాది రూ.15లక్షల వరకు నష్టం మిగలనుంది. గ్రామాల్లో అధికారులు సర్వే చేసి తోటలను కౌలుకు తీసుకున్న రైతులను గుర్తించి వారికే నష్టపరిహాం అందేలా చర్యలు తీసుకోవాలి.

–బాలెబోయిన రాజుగౌడ్‌, కాపుగల్లు, కౌలు రైతు

పూత, కాతలేక నష్టం

15 ఎకరాల్లో మామిడితోట సాగు చేస్తున్నాను. ప్రతి ఏడాది ఏదో విధంగా దిగుబడిలేక, ఉన్నా రేటు రాక నష్టపోతున్నా. అసలు ఈ ఏడాది పూత, కాతలేక వైరస్‌తో తీవ్రంగా నష్టం జరిగింది. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలి. ఇక మామిడిపై ఆశలు సన్నగిల్లుతున్నాయి.

–ఇర్ల సీతరాంరెడ్డి, గణపవరం, రైతు

కొర్రీలు పెట్టి.. ధర తగ్గించి..

మామిడి రైతులు జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారు. అక్కడికి వచ్చిన మామిడికాయలకు ఏదో ఒక రైతుకు మాత్రమే టన్నుకు రూ.50 వేల ధర చెల్లించి మిగిలినవారి కాయలకు రూ.25 వేల నుంచి రూ.30 వేలకు దళారులు కొనుగోలు చేస్తున్నారు. ఇదేమిటని రైతులు ప్రశ్నిస్తే కాయ సైజు లేదు, మంగు ఉంది అంటూ పలు రకాల కొర్రీలు పెడుతూ సరైన ధర చెల్లించడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌కు తీసుకెళ్లిన కాయలు ఇంటికి తేలేక అక్కడే వచ్చిన రేటుకు రైతులు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది.

దీనికితోడు ప్రైవేట్‌ మార్కెట్‌లో ధర లేక దిగులు

సైజు, మంగు పేరిట దళారుల కొర్రీలు

టన్నుకు రూ.25వేల నుంచి రూ.30వేలకు కొనుగోలు

కోదాడరూరల్‌ : ఈ ఏడాది మామిడి తోటల్లో సరైన పూత, కాత లేకపోవడంతో పాటు ఉన్న కొద్ది కాయలు ఇటీవల కురిసిన ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షానికి నేలరాలాయి. దీంతో జిల్లాలో 3,092 ఎకరాల్లో నష్టంవాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. దీనికి తోడు తోటల్లో ఉన్న కాస్త పంటలను అమ్ముకోవాలంటే ధరలేక దిగాలు పడాల్సిన దుస్థితి నెలకొంది. డిసెంబర్‌, జనవరిలో పూత ప్రారంభమై ఫిబ్రవరి, మార్చి నుంచే దిగుబడి రావాల్సి ఉండగా ఈ ఏడాది పూతే.. మార్చిలో వచ్చింది. అది కూడా సరిగా లేకపోవడంతో 20 నుంచి 30 శాతం మాత్రమే కాతకాసింది. అసలే కాత తక్కువ ఉంటే ఉన్న కొద్ది కాయలు కూడా వారం రోజులుగా వీస్తున్న ఈదురు గాలులు, వర్షాలకు రాలిపోయాయి.

1,730 మంది రైతులకు చెందిన..

జిల్లాలో 11,531 ఎకరాల్లో మామిడి తోటలు సాగులో ఉన్నాయి. ఇటీవల కురిసిన ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షానికి 1,730 మంది రైతులకు చెందిన 3,092 ఎకరాల్లోని మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. కొన్ని చోట్ల చెట్లు నేలకొరిగి పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.

సన్నగిల్లుతున్న ఆశలు

సంవత్సరానికి ఓ సారి మాత్రమే వచ్చే మామిడి దిగుబడిపై రైతుల ఆశలు ఏటికేడు సన్నగిల్లుతున్నాయి. ఓ ఏడాది కాత ఉంటే ధర ఉండటం లేదు. మరో ఏడాది ధర ఉంటే కాత కాయడం లేదు. ఇంకో ఏడాది రెండు కూడా లేకుండా పోతున్నాయి, అదృష్టం బాగుండి కాత, దిగుబడి రెండు ఉన్నా ఈదురుగాలులు, వడగండ్ల వర్షాలకు నష్టపోతున్నారు . దీంతో రైతులు మామిడి పంటపై నమ్మం కోల్పోతున్నారు. ఈ పంటలో మరో పంట సాగు చేయక పోవడంతో సంవత్సరం అంతా భూమిని ఖాళీగా ఉంచి ఈ ఏడాది అయినా లాభం రాకపోతదా అనే ఆశతో ఉంటే.. తీరా పంట చేలికొచ్చే సమయానికి ఏదో విధంగా నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తీవ్రంగా నష్టపోయిన కౌలు రైతులు

మామిడి కౌలురైతులు ఈ ఏడాది తీవ్రంగా నష్టపోయారు. గత ఏడాది వరకు ఎకరాకు రూ.40వేల వరకు కౌలు ఉంది. ఈ ఏడాది మాత్రం చెట్టు సంవత్సరాలను బట్టి రూ.50వేల నుంచి రూ. 60 వేల వరకు పెంచారు. దీంతో పెట్టుబడి ఎకరాకు రూ.40 వేల నుంచి 50వేల వరకు పెట్టారు. కౌలు రైతు ఎకరాకు దాదాపు రూ. లక్షవరకు పెట్టుబడుతులు పెట్టాడు. ఉన్న కొద్ది కాయలు కూడా గాలి దుమారానికి రాలడంతో పెట్టిన పెట్టుబడులు కూడా రావని కౌలు రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటల బీమాపై రైతులకు అవగాహన ఉండడంలేదు. ఒక వేళ అవగాహన ఉన్న రైతులు వేల రూపాయలు బీమా కట్టినా పంట నష్టపోయినప్పుడు పరిహారం రావడంలేదు. దీంతో బీమా చెల్లించడానికి మామిడి రైతులెవరూ ముందుకు రావడంలేదు.

మామిడి రైతు కుదేలు1
1/3

మామిడి రైతు కుదేలు

మామిడి రైతు కుదేలు2
2/3

మామిడి రైతు కుదేలు

మామిడి రైతు కుదేలు3
3/3

మామిడి రైతు కుదేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement