ఇళయరాజాకు అభినందనలు తెలుపుతున్న విడుదలై చిత్ర యూనిట్ సభ్యులు
షూటింగ్ స్పాట్లో దర్శకుడికి సగం పనిని టెన్షన్‌ను తగ్గించేది సహాయ దర్శకులే. దీంతో చాలామంది దర్శకులు తమ శిష్యులను బాగా చూసుకుంటారు. అవసరమైన సహాయం చేస్తూ ఉంటారు. కాగా దర్శకుడు వెట్రిమారన్ తన శిష్యులకు అందించే సాయం వేరేగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే చాలా కాస్ట్‌లీ. ఈయన తాజాగా హాస్య నటుడు సూరిని కథానాయకుడిగా పరిచయం చేసి విడుదలై చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించారు.
ఎల్ రెడ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందడం విశేషం. కాగా చిత్ర తొలి భాగం గత నెల 31వ తేదీన విడుదలై విశేష ప్రేక్షకాదరణతో పాటు, విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. కాగా ఈ చిత్ర విడుదలకు ముందే దర్శకుడు వెట్రిమారన్ తన శిష్యులు 25 మందికి తలా ఓ ప్లాట్‌ను బహుమతిగా కొనిచ్చారు. కాగా తాజాగా విడుదలై చిత్రం సాధిస్తున్న విజయానందంతో చిత్ర యూనిట్ ఆదివారం ఉదయం సంగీత దర్శకుడు ఇళయరాజాని కలిసి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా దర్శకుడు వెట్రిమారన్ చిత్ర సభ్యులందరికీ తలా ఒక బంగారు నాణేన్ని బహుమతిగా అందించారు. ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అలాగే విడుదలై– 2 పై చిత్రంపైనా అంచనాలు పెరిగిపోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment