
కోలీవుడ్‌లో స్టార్ హీరోలుగా రాణిస్తున్న సోదర ద్వయం సూర్య, కార్తీ. ఇద్దరూ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. కాగా యువనటి కృతిశెట్టి విషయానికి వస్తే టాలీవుడ్‌లో క్రేజీ కథానాయకిగా రాణిస్తోంది. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా తెలుగు, తమిళం, భాషల్లో వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న కస్టడీ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ బ్యూటీ ది వారియర్ చిత్రం ద్వారా కోలీవుడ్ ప్రేక్షకులను పలుకరించింది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించుకోకపోవడం ఈమెను నిరాశపరిచింది.
అలాంటి పరిస్థితుల్లో తమిళంలో సూర్యకు జంటగా నటించే లక్కీచాన్స్ వరించడంతో సంబరపడిపోయింది. అయితే అది గాలిలో కలిసిపోయింది. బాలా దర్శకత్వంలో షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం కొంత భాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న తరుణంలో దర్శకుడు బాలా, సూర్య మధ్య విబేధాల కారణంగా సూర్య ఆ చిత్రం నుంచి వైదొలిగారు. దీంతో ఆ తరువాత దర్శకుడు బాలా కథలో మార్పులు చేర్పులు కారణంగా అందులో హీరోహీరోయిన్లు కూడా మారిపోయారు.
అలా ఆ చిత్రం కృతిశెట్టికి మిస్ అయ్యింది. అయితే అప్పుడు సూర్య సరసన నటించే అవకాశం చేజారినా, ఆయన తమ్ముడు కార్తీతో రొమాన్స్ చేసే అవకాశం వరించింది. అవును జపాన్ చిత్రంలో నటిస్తున్న కార్తీ తర్వాత స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజా నిర్మించనున్న చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. నలన్ కుమారసామి దర్శకత్వం వహించనున్న ఇందులో కృతిశెట్టి హీరోయిన్‌గా నటించనున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.