ఆభరణాల కొనుగోళ్లలో మహిళలు
సాక్షి, చైన్నె: నెలవంక కన్పించడంతో శనివారం రంజాన్ పండుగను జరుపుకునేందుకు రాష్ట్రంలోని ముస్లింలు సిద్ధమయ్యారు. ప్రత్యేక ప్రార్థనలకు మసీదులు ముస్తాబయ్యాయి. ముస్లింలు అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో పండుగ సందడి మిన్నంటుతోంది.
మహ్మద్ ప్రవక్త సూక్తుల మేరకు పుణ్య కార్యాలకు, సమత మమతలకు నెలవుగా రంజాన్ మాసం నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ మాసంలో నరక ద్వారాలు మూసుకుని, స్వర్గ ద్వారాలు తెరచుకుంటాయన్నది ముస్లింల నమ్మకం. అందుకే పాప కర్మల నుంచి విముక్తి పొందడానికి ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఈ మాసంలో ఉపవాస దీక్షల్ని (రోజా) ఆచరించారు. పేద, గొప్ప అన్న బేధం లేకుండా అల్లాకు విశ్వాసపాత్రులుగా ఉంటూ సేవల్లో నిమగ్నమయ్యారు. ధాన ధర్మాలు చేస్తూ ఈద్ ముబారక్ వేళకు సన్నద్ధమయ్యారు.
నేడు పండుగ..
శుక్రవారం రాత్రి ఆకాశంలో నెలవంక కనిపించడంతో శనివారం పండుగను జరుపుకునే విధంగా ప్రభుత్వ ఖాజీ ప్రకటించారు. దీంతో పరస్పరం ముస్లింలు మసీదుల వద్ద శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ఉదయాన్నే పండుగను జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. పవిత్ర రంజాన్ కోసం కొత్త బట్టల కొనుగోళ్లను ఇప్పటికే పూర్తి చేశారు. వస్తువుల కొనుగోళ్ల నిమిత్తం షాపింగ్ సెంటర్లకు తరలివచ్చారు. దీంతో ముస్లింలు అత్యధికంగా ఉండే నగరాలు, పట్టణాలు, ప్రాంతాలలో పండుగ వాతావరణం మిన్నంటుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం కొన్ని చోట్ల ఉదయం తొమ్మిది గంటలకు, మరికొన్ని చోట్ల తొమ్మిదిన్నర, పది గంటలకు రంజాన్ ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు. కొన్ని చోట్ల ఈద్గా మైదానాల్లో మరికొన్ని మసీదుల్లో ప్రార్థనలు జరగనున్నాయి. రాష్ట్రంలోని అన్ని మసీదులను విద్యుద్దీప కాంతులతో అలంకరించి ఉండడం విశేషం. మరికొన్ని చోట్ల ఎండ వేడి నుంచి ఉపశమనం కల్గే విధంగా షామియానాలను, పందిళ్లను ఏర్పాటు చేశారు. అలాగే, రంజాన్ రోజున మాంసం విందు కోసం రాష్ట్రంలోని సంతలలో శుక్రవారం ఒక్క రోజు రూ.20 కోట్ల విలువ గల మేకలు, గోర్రెల విక్రయాలు జరిగాయి. ఇదిలా ఉండగా సౌదీ అరేబియాలో శుక్రవారం రంజాన్ పండుగ జరగడంతో ఆ కాలమానాన్ని అనుసరిస్తూ రాష్ట్రంలో కొన్ని మైనారిటీ సంఘాల నేతృత్వంలో ఈద్ ప్రార్థనలు జరిగాయి.
నేతల శుభాకాంక్షలు..
రంజాన్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలోని ముస్లింలకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ప్రధాన ప్రతి పక్ష నేత, అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి పళనిస్వామి, మాజీ సీఎం పన్నీరుసెల్వం తమ వేర్వేరు ప్రకటనలలో ముస్లింలు అందరూ ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. రంజాన్ ప్రత్యేక ప్రార్థనలతో కుటుంబసమేతంగా పండుగను జరుపుకోవాలని సూచించారు. ప్రేమానురాగాలు, సోదరభావం, సమానత్వం వికసించాలని ఆకాంక్షించారు. అలాగే డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్, పీఎంకే నేత రాందాసు, ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, ఎస్‌ఎంకే నేత శరత్‌కుమార్, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ నేత ఖాదర్ మొహిద్దీన్, మనిద నేయ మక్కల్ కట్చి నేత జవహరుల్లా, తమిళ మానిల కాంగ్రెస్ అధినేత జీకే వాసన్, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్, చిన్నమ్మ శశికళ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ అళగిరి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment