సాక్షి, చైన్నె: చైన్నె – బెంగళూరు జాతీయ రహదారిలో శనివారం అర్ధరాత్రి సమయంలో ఓ కారు టైర్ హఠాత్కుగా పేలింది. దీంతో అతివేగంగా ప్రయాణిస్తున్న ఈ కారు అదుపు తప్పి ఆగి ఉన్న లారీని ఢీకొంది. కారు నుజ్జు నుజ్జుకావడంతో ఆ శిథిలాల కింద చిక్కుకుని నలుగురు ఘటనా స్థలంలోనే మరణించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మూడునెలల మగ బిడ్డను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. వివరాలు.. తిరువణ్ణామలై జిల్లా సెంగం తాలుకా నాచ్చియార్ పట్టు గ్రామానికి చెందిన రామజయం(40) తన భార్య రత్న (35), కుమార్తెలు రాజలక్ష్మి(5), తేజశ్రీ(2), మూడు నెలల బిడ్డ, బంధువు రాజేష్(25)తో కలిసి రెండు రోజుల క్రితం చైన్నెకు వచ్చారు.
భార్య రత్న తల్లిదండ్రుల ఇంట్లో ఉన్నారు. ఇక్కడి నుంచి రాత్రి సెంగానికి తిరుగుప్రయాణమయ్యారు. మార్గం మధ్యలో చైన్నె – బెంగళూరు జాతీయ రహదారిలోని కాంచీపురం జిల్లా చిట్టేరి మేడు వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు టైరు పేలింది. ఈ క్రమంలో అది రోడ్డు పక్కగా ఆగి ఉన్న లారీని కారు వేగంగా ఢీకొంది. కారు నుజ్జు నుజైంది. భారీ శబ్ధం విన్న ఆ పరిసర వాసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాంచీపురం పోలీసులు కారు శిథిలాలలో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు శ్రమించారు.
ఈ ప్రమాదంలో రత్న, రాజలక్ష్మి, తేజశ్రీ, రాజేష్ ఘటనా స్థలంలోనే మరణించారు. తీవ్రంగా గాయపడ్డ మూడు నెలల మగ బిడ్డ, రామజయంను ఆసుపత్రికి తరలించారు. మార్గం మధ్యలో ఆ బిడ్డ కూడా మరణించింది. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. మృతదేహాలను పోస్టుమార్టానికి పోలీసులు తరలించారు. కారులో ఉన్నసెల్ ఫోన్‌లోని నంబర్ల ఆధారంగా చైన్నె, తిరువణ్ణామలైలోని బంధువులకు సమాచారం ఇచ్చారు. కాంచీపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment