సాక్షి, చైన్నె : చైన్నె – బెంగళూరు నగరాల మధ్య అత్యంత వేగవంతమైన రైలు సేవలను అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే యంత్రాంగం నిర్ణయించింది. ఇందుకు తగ్గ ప్రక్రియపై దృష్టి పెడుతూ నివేదిక బాధ్యతలను ఓ ప్రైవేటు సంస్థకు తాజాగా అప్పగించింది. వివరాలు.. చైన్నె – బెంగళూరు మధ్య రైలు ప్రయాణ దూరం 350 కిలోమీటర్లు.
వీటిమధ్య ప్రస్తుతం నాలుగున్నర నుంచి ఆరున్నర గంటల మేరకు ప్రయాణ సమయం తీసుకుంటోంది. వందే భారత్, డబుల్ డెక్కర్ రైలు సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వందే భారత్ రైలు ద్వారా ప్రయాణ సమయం 4.30 గంటలుగా ఉంది. ఈ పరిస్థితుల్లో చైన్నె – బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌పై కేంద్రం దృష్టి పెట్టి ఈ మార్గంలో అతి వేగంతమైన రైలు ఏర్పాటు చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.
రెండు గంటల్లోనే..
గంటకు 220 కి.మీ వేగంతో రైలు నడిచేందుకు వీలుగా ఈ మార్గంలో ప్రత్యేక రైల్వే ట్రాక్ రూపొందించేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఈ ట్రాక్‌పై గంటకు 200 కి.మీ వేగంతో రైలు నడిచినా చైన్నె – బెంగళూరు మధ్య ప్రయాణ సమయం 2 గంటలే అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మార్గంలో పనులు చేపట్టేందుకు సాధ్యాసాధ్యాలపై నివేదిక సమర్పణ బాధ్యతలను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారు.
ఇందుకోసం రూ. 8.30 కోట్లు వెచ్చించారు. చైన్నె నుంచి బెంగళూరు వరకు ప్రత్యేక రైల్వే మార్గానికి అవసరమయ్యే ట్రాక్ కోసం స్థల సేకరణ, భూ సామర్థ్యం, ఈ మార్గంలో వచ్చే పట్టణాలు, నగరాలు, గ్రామాలు, క్రాసింగ్స్ తదితర సమగ్ర పరిశీలన మేరకు మూడు నెలల్లో ఈ ప్రైవేటు సంస్థ కేంద్ర రైల్వే యంత్రాంగానికి నివేదికను సమర్పించనుంది. దాని తర్వాత ఈ మార్గంలో 16 బోగీలతో 200 కి.మీ వేగంతో వేగవంతమైన రైలు నడిపేందుకు చర్యలుంటాయని ఓ రైల్వే అధికారి మంగళవారం పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment