షర్మిలకు కారు డాక్యుమెంట్ అందజేస్తున్న కమల్
సాక్షి, చైన్నె : డ్రైవర్‌గానే కాకుండా, పదిమంది యువతులకు ఉద్యోగాలు ఇచ్చే ఓనర్ స్థాయికి షర్మిల ఎదగాలని కాంక్షిస్తూ మక్కల్ నీది మయ్యం నేత, విశ్వనటుడు కమల హాసన్ ఆమెకు ఒక కారును బహుమతిగా ఇచ్చారు. ఆయన సోమవారం షర్మిలకు డాక్యుమెంట్లు అందజేశారు. కోయంబత్తూరులో తొలి ప్రైవేటు బస్సు మహిళా డ్రైవర్‌గా షర్మిల(24) సుపరిచితురాలు. గతవారం ఆమె నడుపుతున్న బస్సులో డీఎంకే ఎంపీ కనిమొళి ఎక్కారు. ఆమెను అభినందించారు. బహుమతిగా చేతి గడియారం ఇచ్చారు. తర్వాత ఆమె డ్రైవర్ ఉద్యోగం ఊడింది.
షర్మిల ఇటీవల కాలంగా సామాజిక మాధ్యమాల్లో సెలబ్రిటీ కావడంతో ఆమె ప్రచారం కోసం పాకులాడుతున్నట్టుందని ఆ బస్సు యజమాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో బస్సును గాంధీపురం బస్టాప్‌లో వదలి పెట్టి ఆమె వెళ్లి పోయారు. దీనిపై ఎంపీ కనిమొళి స్పందించారు. తాను ఆటో నడుపుకుంటానని షర్మిల చెప్పడంతో నగదు సాయంతోపాటు బ్యాంకు ద్వారా రుణ సాయం చేస్తానని కనిమొళి హామీ ఇచ్చారు.
తక్షణం స్పందించిన కమల్‌హాసన్
షర్మిలకు జరిగిన అన్యాయం గురించి తెలుసుకున్న విశ్వనటుడు, మక్కల్ నీది మయ్యం నేత కమల్ హాసన్ తక్షణం స్పందించారు. ఆమెను డ్రైవర్‌గానే పరిమితం చేయకుండా ఓనర్ స్థాయికి ఎదగాలని కాంక్షిస్తూ ఏకంగా ఒక కారును బహుమతిగా ఇస్తున్నట్టు ప్రకటించారు. సోమవారం షర్మిలను చైన్నెకి పిలిపించి కారుకు సంబందించిన పత్రాలను కమల్ అందజేశారు. ఆమె కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ తొలి ప్రభుత్వ బస్సు డ్రైవర్ వసంత కుమారి, తొలి అంబులెన్స్ డ్రైవర్ వీరలక్ష్మీ అని గుర్తు చేశారు. తొలి ప్రైవేటు బస్సు డ్రైవర్‌గా షర్మిల పేరుగడించారని గుర్తు చేశారు. డ్రైవర్ కావాలన్న తన కలను సాకారం చేసుకున్న షర్మిల భవిష్యత్తులో తనలాంటి యువతులకు ఆదర్శంగా ఉండటమే కాకుండా, పది మందికి ఉద్యోగాలు కల్పించే యజమాని స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment