
సాక్షి, చైన్నె: ఎన్నికల హామీగా గృహిణులకు రూ.1000 నగదు పంపిణీ పథకం కలైంజ్ఞర్ మగలిర్ ఉరిమై తొగై (కలైంజర్ మహిళా హక్కు మొత్తం) అమలుకు మార్గదర్శకాలు విడుదలయ్యాయి. అర్హులైన వారందరికి ఈ పథకం వర్తింపచేయాలని సీఎం స్టాలిన్ శుక్రవారం ఆదేశించారు. సాయంత్రం సచివాలయంలో ఈ పథకం అమలుకు లబ్ధిదారుల ఎంపిక అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం సమావేశమయ్యారు. రాష్ట్ర స్థాయి అధికారులు, సీఎస్ శివదాస్ మీనా, మంత్రులు ఉదయనిధి స్టాలిన్ హాజరయ్యారు. తమిళనాడు ప్రభుత్వ పరిపాలనా చరిత్రలోనే ఈ పథకం ఓ చిహ్నంగా మారబోతోందని ఈసందర్భంగా సీఎం ధీమా వ్యక్తంచేశారు. ఈ పథకానికి కలైంజ్ఞర్ పేరు పెట్టడం సంతోషంగా ఉందన్నారు.
కోటి మంది మహిళాలకు నెలకు రూ.1000 నగదు పంపిణీ చేస్తామని తెలిపారు. కలైంజ్ఞర్ ‘మహిళల హక్కుల మొత్తం’ దీనిని ముందుకు తీసుకెళ్తామన్నారు. ఈపథకం కోసం 2023–2024 బడ్జెట్‌లో 7 వేల కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ఈ పథకం సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అర్హులైన వారికి న్యాయం చేకూర్చాలని సూచించారు. నిర్ణీత గడువులోపు అర్హులను ఎంపికచేయాలని ఆదేశించారు. ఈ పథకానికి సంబంధించి మార్గదర్శకాలను సక్రమంగా అమలు చేయాలని, ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఆదేశించారు.
ఈ పథకం కోసం కోటిన్నర మంది నుంచి దరఖాస్తులు వస్తాయని అంచనా వేశామన్నారు. దరఖాస్తులను చౌకదుకాణాలు, ప్రత్యేక శిబిరాల ద్వారా స్వీకరించాలని సూచించారు. దరఖాస్తుల స్వీకరణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను పోలీసు యంత్రాంగం కల్పించాలన్నారు. ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందేందుకు దరఖాస్తులు చేసుకుంటున్న వారి నుంచి రేషన్, ఆధార్ కార్డు వివరాలను సేకరించాలన్నారు.
అర్హులైన వారి వద్ద వివరాలు లేకుంటే పరిశీలించి న్యాయం చేయాలన్నారు. అలాగే రేషన్ కార్డు కలిగిన ఓ కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ఈ నగదు పంపిణీ జరుగుతుందన్నారు. అలాగే, ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ పథకం కింద ఎంపికయ్యే మహిళలు ఇక, కుటుంబ పెద్దలుగా ఉంటారని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment