సాక్షి, చైన్నె: రామనాథపురం జిల్లాలోని రామేశ్వరం ఆథ్యాత్మికంగా, పర్యాటకంగా ఎంతో ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఇక్కడికి నిత్యం రామనాథ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు, పర్యాటక అందాల్ని తిలకించేందుకు దేశ విదేశీయులకు చెందిన వారు తరలి వస్తుంటారు. ఇక్కడ సముద్ర తీరంలోని అగ్ని తీర్థం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ స్నానం చేసినానంతరం భక్తులు ఆలయంలోని ఉన్న మరో బావి నీళ్లు చల్లుకుని రామనాథ స్వామి దర్శనార్థం వెళ్లడం జరుగుతోంది. ఇటీవల ఓ పరిశోధనలతో రామేశ్వరం పరిసరాల్లో 1962 కాలంలో 62 తీర్థాలు ఉన్నట్లు తేల్చారు.
ఇందులో 30 తీర్థాలను ప్రస్తుతం గుర్తించారు. ఇవి ఆయడ మగుడం, తంగచ్చి మఠం, మండపం, ఉప్పురూ తదితర ప్రాంతాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. వీటిని పునరుద్ధరించి ఆథ్యాత్మిక, పర్యాటకంగా ఈ పరిసరాలను తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రత్యేక కార్యాచరణపై దృష్టి పెట్టింది. అలాగే, మండపం నుంచి పాంబన్ మీదుగా రామేశ్వరానికి రైలు ప్రయాణం సముద్రం మధ్యలో సాగుతోంది.
చైన్నె నుంచే కాదు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి సైతం రామేశ్వరానికి పలు రైళ్ల సేవలు అందుబాటులో ఉన్నాయి. మండపం నుంచి రామేశ్వరం వైపుగా రైలు సాగేందుకు పాంబన్ దీవుల్ని తాకుతూ రైల్వే వంతెన నిర్మించి 110 ఏళ్లు అవుతోంది. 1964లో కడలి కల్లోలానికి పాంబన్ సమీపంలోని ధనుస్కోడి నామ రూపాలు లేకుండా పోయినా, ఈ వంతెనకు మాత్రం చెక్కు చెదర లేదు. అందుకే ఈ వంతెనను అభివృద్ధి చేయడంతో పాటు, ప్రత్యామ్నాయ వంతెన నిర్మాణాలపై కేంద్రం దృష్టి పెట్టింది.
2018–19లో..
రామేశ్వరం, మండపం, పాంబన్, ధనుష్కోడి పరిసరాల నుంచి కచ్చదీవులు, శ్రీలంక సముద్ర తీర దీవులు కూత వేటు దూరంలోనే ఉన్నాయి. ఈ పరిసరాలను కలిపే విధంగా ప్రయాణికుల నౌకను నడిపేందుకు ప్రయత్నాలు సైతం సాగుతున్నాయి. అలాగే 1964లో కడలి సృష్టించిన కల్లోలానికి నామ రూపాలు లేకుండా పోయిన ధనుష్కోడిని మళ్లీ పునరుద్ధరించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే విధంగా కసరత్తు చేపట్టారు. ఇందులో భాగంగా గతంలో గల్లంతైన రామేశ్వరం నుంచి ధనుష్కోడికి రైల్వే మార్గం పునరుద్ధరించే విధంగా కొత్త మార్గానికి సిద్ధమయ్యారు. ఈ మార్గంలో 17.2 కి.మీ దూరం రూ.733 కోట్లతో 2018–19లో రైల్వే ప్రాజెక్టును కేంద్ర రైల్వే శాఖ ప్రకటించింది. అటవీ శాఖకు చెందిన 28 హెక్టార్లు, తమిళనాడు ప్రభుత్వానికి చెందిన 43 హెక్టార్లు, ప్రైవేటుకు చెందిన 3.66 హెక్టార్లను ఈ రైల్వే మార్గం, రైల్వేస్టేషన్ల ఏర్పాటు కోసం సేకరించాలని నిర్ణయించారు. తొలి విడతగా రూ.385 కోట్లను ప్రకటించారు. ఈ పనులకు లోక్‌సభ ఎన్నికలకు ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన కూడా చేశారు.
వ్యతిరేకత..
ఈ ప్రాజెక్టుకు రాష్ట్రంలోని డీఎంకే ప్రభుత్వం వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖిత పూర్వంగా ప్రకటించడం గమనార్హం. రామేశ్వరం – ధనుష్కోడి రైల్వే ప్రాజెక్టును తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకిస్తూ, నిరాకరించినట్లు ఇందులో ప్రకటించారు. ధనుష్కోడి పరిసరాల్లో రైల్వే ప్రాజెక్టు కారణంగా పర్యావరణ సంబంధింత సమస్యలు అనేకం ఉత్పన్నం అవుతాయని, అలాగే, ఇక్కడ పనులు సమస్యాత్మక పరిస్థితులను సృష్టించే అవకాశాలు ఉన్నాయని తమిళనాడు ప్రభుత్వం తన లేఖలో వివరించింది. ఈ రైల్వే ప్రాజెక్టును పక్కన పెడితే మంచిదని, ఈ ప్రాజెక్టు తాము వ్యతిరేకం అని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో కేంద్రం మున్ముందు ఎలాంటి చర్యలు చేపట్టనుందో అనే విషయం ఉత్కంఠ రేపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment