సాక్షి, చైన్నె : సినీ నటి గౌతమి బీజేపీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీ నుంచి వైదొలగుతున్నట్లు ఆమె మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీలోని నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, తనను మోసం చేసిన మోసగాడికి అండగా బీజేపీ నాయకులు ఉన్నారని తెలిసి తీవ్ర మనో వేదనకు గురైనట్టు పేర్కొన్నారు. గౌతమి విడుదల చేసిన ప్రకటనలోని వివరాలు.. ‘బరువెక్కిన హృదయంతో , తీవ్ర అసంతృప్తితో బీజేపీ నుంచి వైదొలగేందుకు నిర్ణయించాను. గత 25 సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందిస్తూ వస్తున్నాను , ఈ పయనంలో ఎన్నో సవాళ్లు, ఒడి దొడుగులు ఎదుర్కొన్నాను.
అయినా, తన పని తాను సక్రమంగా చేస్తూ ముందుకు సాగినట్టు పేర్కొన్నారు. పార్టీ నుంచి, నాయకుల నుంచి తనకు ఎలాంటి మద్దతు, సహకారం లేక పోవడమే కాకుండా నన్ను మోసం చేసిన అలగప్పన్‌కు అండగా తమ పార్టీ వాళ్లే ఉన్నట్టుగా వచ్చిన సమాచారం తీవ్రంగా కలచి వేసింది. 37 సంవత్సరాలు సినిమా, టీవీ, రేడియో, డిజిటల్ మీడియాలో కష్టపడి సంపాదించిన సొమ్ముతో కుమార్తెతో తన జీవితం ఉజ్వలమయంగా ఉండాల్సిందన్నారు. అయితే అలగప్పన్ తనను ఆర్థికంగా మోసం చేశాడని, నగదు, ఆస్తులను అపహరించాడని ఇటీవలే తన దృష్టి వచ్చిందన్నారు.
ఈ విషయంగా పోలీసులను ఆశ్రయించానని గుర్తుచేశారు. అయితే ఆ మోసగాడికి బీజేపీలోని కొందరు నేతలు అండగా ఉండడం తనను కలిచి వేసిందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, పోలీసులు, న్యాయం వ్యవస్థ మీద నమ్మకంతో తాను చేసిన ఫిర్యాదుపై న్యాయం దక్కుతుందనే ఎదురు చూపులో ఉన్నాను. 2021 ఎన్నికల్లో రాజపాళయం సీటు తనకే అని చెప్పడంతో పార్టీ బలోపేతానికి తీవ్ర కృషి చేశానని, చివరి క్షణంలో సీటు దక్కకుండా చేశారని గుర్తుచేస్తూ, ఎలాంటి మద్దతు , సహకారం, ఆదరణ లేని పార్టీలో కొనసాగలేను.
నన్ను మోసం చేసిన వ్యక్తి 40 రోజులుగా బీజేపీ సీనియర్ల సహకారంతో అజ్ఞాతంలో ఉన్నట్టు వచ్చిన సమాచారం తనను మరింతగా కుంగదీసింది. అందుకే పార్టీ నుంచి బయటకు వెళ్తున్నాను’ అని ప్రకటించారు. ఇదిలా ఉండగా, గౌతమి నిర్ణయంపై బీజేపీ మహిళానేత,నటి కుష్భు విచారం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇటీవల బీజేపీ నుంచి బయటకు వచ్చిన నటి గాయత్రి రఘురాం మరో మారు తెర మీదకు వచ్చి, బీజేపీలో మహిళలకు గుర్తింపు లేదని, న్యాయం దక్కదని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment