యువ జంట అరెస్టు
సేలం: ప్రియుడి కోసం కన్యాకుమారి జిల్లా వడచ్చేరిలో పోలీసు యూనిఫారంతో సబ్ ఇన్‌స్పెక్టర్ అని తెలుపుతూ హల్‌చల్ చేస్తున్న యువతిని, అందుకు కారణమైన ప్రియుడిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. కన్యాకుమారి జిల్లా వడచ్చేరికి చెందిన వ్యక్తి శివ. ఇతనికి రైలు ప్రయాణంలో చైన్నె తాంబరానికి చెందిన అభిప్రభ అనే యువతి పరిచయమైంది. వీరి స్నేహం ప్రేమగా మారింది. వీరి ప్రేమ వ్యవహారం గురించి శివ తన తల్లికి తెలిపిన స్థితిలో తనకు మహిళా పోలీసు కోడలిగా రావాలని తల్లి కోరినట్టు సమాచారం.
దీంతో తన ప్రియురాలు అభిప్రభను పోలీసు వేషధారణలో తన తల్లికి కనిపించాల్సిందిగా శివ కోరాడు. ప్రియుడి కోరిక మేరకు అభిప్రభ పోలీసు దుస్తులను అద్దెకు తీసుకుని సబ్ ఇన్‌స్పెక్టర్‌లా వెళ్లి శివ తల్లిని కలిసింది. అప్పుడు తాను తాంబరంలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నట్టు తెలిపిందని సమాచారం. దీంతో అభిప్రభ తన స్నేహితుడైన పృథ్వీరాజ్ సాయంతో పోలీసు దుస్తులను తీసుకుని చైన్నె, నెల్‌లై, కన్యాకుమారి తదితర ప్రాంతాలలో తాను పోలీసు దుస్తుల్లో ఉన్నట్టు ఫొటోలు, వీడియోలను తీసుకుని ప్రియుడు శివ తన తల్లిదండ్రులకు చూపించి, వారి వివాహానికి అనుమతి పొందినట్లు తెలుస్తోంది.
పట్టించిన బ్యూటీ పార్లర్
ఈ స్థితిలో గత నెల 28వ తేది నాగర్‌కోవిల్‌లో డబ్ల్యూసీసీ సమీపంలో ఉన్న ఒక బ్యూటీ పార్లర్‌కు ఫేషియల్ చేసుకున్న అభిప్రభ తాను వడచేరిలో ఉన్న పోలీసుస్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నట్టు తెలిపి డబ్బులు ఇవ్వకుండా వెళ్లినట్టు తెలిసింది. అదే విధంగా మళ్లీ గురువారం సాయంత్రం అదే బ్యూటీ పార్లర్‌కు వెళ్లి ఫేషియల్ చేసుకుంది. అప్పుడు సందేహం ఏర్పడిన బ్యూటీ పార్లర్ యజమాని వడచేరి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు అక్కడ ఉన్న అభిప్రభను పోలీసు స్టేషన్‌కు తీసుకు వచ్చి విచారించగా తన ప్రేమ వివాహం కోసం ప్రియుడి కోరిక మేరక తాను సబ్ ఇన్‌స్పెక్టర్‌గా నాటకం ఆడినట్లు అంగీకరించింది. దీంతో నకిలీ పోలీసుగా హల్‌చల్ చేసినందుకు అభిప్రభను, ఆమెను పోలీసుగా నటింప చేసినందుకు ప్రియుడు రవిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment