
ఆలయాల పునరుద్ధరణకు భారీగా నిధులు
సాక్షి, చైన్నె : గ్రామీణ ఆలయాలు, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గం నివసించే ప్రాంతాలలోని ఆలయాల అభివృద్ధి, పునరుద్దరణ పనులకు నిధులను పెంచుతూ సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 1,250 గ్రామీణ, మరో 1,250 ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలు నివాసం ఉండే ప్రాంతాలలోని ఆలయాలకు రూ. 62.50 కోట్లను కేటాయించారు. బుధవారం సీఎం స్టాలిన్ సచివాలయం నుంచి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, నిర్మాణాలు పూర్తి చేసుకున్న భవనాలు, ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అలాగే, మరెన్నో పనులకు శంకు స్థాపన చేశారు. ఇందులో భాగంగా హిందూధర్మాదాయ శాఖ నేతృత్వంలోని ఆలయానికి వచ్చే భక్తులకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరిచే దిశగా చర్యలు విస్తృతం చేశారు. అలాగే ఆలయాల పునరుద్ధరణకు ఇది వరకు రూ. 2 లక్షలు ఒక్కో ఆలయానికి కేటాయించగా, ప్రస్తుతం ఈ మొత్తాన్ని రూ. 2.50 లక్షలుగా నిర్ణయించారు. 2021–2022, 2022–2023 , 2023–2024 ఆర్థిక సంవత్సరాల్లో 3,750 గ్రామీణ ఆలయాలు, మరో 3,750 ఆది ద్రావిడ గిరిజనులు అధికంగా ఉండే ప్రాంతాలలోని ఆలయాల పునరుద్ధరణ, అభివృద్ధికి రూ. 150 కోట్లు విడుదల చేశారు. 2024–25 సంవత్సరానికి గాను ప్రస్తుతం ఒక్కో ఆలయానికి అదనంగా రూ. 50 వేలు పెంచుతూ మొత్తంగా 2,500 ఆలయాలకోసం రూ. రూ.62.50 కోట్లు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శేఖర్‌బాబు, ప్రధాన కార్యదర్శి ఎన్. మురుగానందం, తిరువణ్ణామలై అధీనం కుండ్రక్కుడి పొన్నంబల అడిగలర్, పేరూర్ అధీనం మరుదాచల అడిగలార్, మైలం బొమ్మాపురం అధినం శివజ్ఞాన పాలయ స్వాములు, సిరవై ఆధీనం కుమార గురుపర స్వామి, పర్యాటకం. సాంస్కృతిక, ధార్మిక సంస్థల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డా. పి. చంద్రమోహన్, కమిషనర్ ఎన్ శ్రీధర్, సుకుమార్ పాల్గొన్నారు. అనంతరం తమిళనాడు అర్బన్ హాబిటాట్ డెవలప్‌మెంట్ బోర్డ్ నేతృత్వంలో రూ. 327.69 కోట్లతోకొత్త గా నిర్మించనున్న 2404 గృహాల పనులకు సీఎం స్టాలిన్ శంకుస్థాపన చేశారు. తమిళనాడులో పట్టణాలలో నివసించే పేద కుటుంబాలకు సొంతింటికలను సాకారం చేసేవిధంగా తమిళనాడు అర్బన్ హాబిటాట్ డెవలప్‌మెంట్ బోర్డ్ తరపున 4,752.46 కోట్లతో 128 ప్రాంతాలలో గృహ నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టి ఇళ్లు లేని పేదలకు 42,313 ప్లాట్‌లను ఇప్పటికే కేటాయించారు.
ఒక్కో ఆలయానికి రూ. 2.50 లక్షలు
2500 ఆలయాలకు రూ. 62.50 కోట్లు
రూ.327.69 కోట్లతో 2404 ప్లాట్లు
అందరికీ
గృహాలు..
ప్రస్తుతం అందరికీ హౌసింగ్ పథకం కింద తిరునెల్వేలి జిల్లా, రాధాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కలైంజ్ఞర్ నగర్ ప్రాజెక్ట్ ప్రాంతంలో రూ. 59 కోట్లతో గ్రౌండ్, ఐదు అంతస్తులతో 468. పెరియార్ నగర్ ప్రాజెక్ట్ ప్రాంతంలో రూ. 63 కోట్ల 45 లక్షలతో ఐదు అంతస్తులతో 504 ప్లాట్‌లతో బహుళ అంతస్తుల భవనాలను నిర్మించేందుకు చర్యలు తీసుకున్నారు. అలాగే దిండిగల్ జిల్లా, ఒట్టం చత్రం ఆచార్య వినోబా భావే నగర్ ప్రాజెక్ట్ ప్రాంతంలో రూ. 66 కోట్ల 24 లక్షలతో మూడు అంతస్తులతో 480 అపార్ట్‌మెంట్లు,అన్నానగర్ ప్రాజెక్ట్ ప్రాంతంలో రూ. 57.4 కోట్లతో 432 ప్లాట్‌లతో మూడు అంతస్తులతో భవనాలను నిర్మించనున్నారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు సహకరాంతో నామక్కల్ జిల్లా, కుమారపాళయం పరిధిలోని పల్లిపాళయం, ఆయకటూర్ ప్రాజెక్ట్‌లో గ్రౌండ్, మూడు అంతస్తులతో రూ. 81 కోట్ల 57 లక్షలతో 520 కొత్త ప్లాట్లు అంటూ మొత్తంగా రూ. 327.69 కోట్లతో 2404 ప్లాట్ల నిర్మాణానికి సీఎం స్టాలిన్ శంకుస్థాపన చేశారు. ఒక్కో ప్లాట్ 400 చదరపు అడుగులతో బహుళ ప్రయోజన గది, పడక గది, వంటగది , మరుగుదొడ్డి సౌకర్యాలతో నిర్మించనున్నారు. ఈ నివాస ల పరిసరాలలో తారు రోడ్డు సౌకర్యం, తాగునీటి సౌకర్యం, వ్యర్థ నీటి ట్యాంక్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సౌకర్యాలతో సదుపాయాన్ని ఏర్పాటు చేయనున్నారు. అనంతరం డెయిరీ శాఖ, మత్స్య, మత్స్యకారుల సంక్షేమ శాఖ తరపున రూ.73.93 కోట్లతో పూర్తయిన 11 ప్రాజెక్టులను సీఎం ప్రారంభించారు. అలాగే రూ. రూ.15 కోట్లతో సిఫుడ్ ఫామ్‌ను ప్రారంభించారు. తిరునల్వేలిలో పశుగ్రాసం కర్మాగారంలో పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనిత ఆర్ రాధాకృష్ణన్, రాజకన్నప్పన్, తదితరులు పాల్గొన్నారు. అలాగే చైన్నె ఎగ్మోర్‌లో రూ.227 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న కో–ఆప్టెక్స్ కాంప్లెక్స్‌పనులకు శంకు స్థాపన చేశారు. బేస్‌మెంట్‌లో 323 వాహాలను నిలిపే విధంగా పార్కింగ్‌కు స్థలం కేటాయించారు. ఇతర అంతస్థులలో తమిళనాడులోని వివిధ జిల్లాలకు చెందిన వారి కోసం 41 దుకాణాలు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారి కోసం మరో 36 దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు. ఎనిమిదో అంతస్తులో సెంటర్, డిజైన్ ప్రెస్ కో–ఆప్టెక్స్ కార్యాలయం కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ కాంప్లెక్స్‌లో క్యాంటీన్, నాలుగు ఎలివేటర్లు, ఆటోమేటిక్ ఎస్కలేటర్లు, వంటి సౌకర్యాలను కల్పించనున్నారు. ఈకార్యక్రమంలో మంత్రులు ఆర్‌గాంధి, శేఖర్‌బాబు, తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ, విపత్తు నిర్వహణ విభాగం తరపున మైలాడుతురై జిల్లా, మైలాడుతురై నాగపట్నం జిల్లా, నాగపట్నంలలో రూ. 9.58 కోట్లతో జిల్లా కలెక్టరేట్ భవనాలు, రూ. 7 కోట్ల 47 లక్షల 21 వేలతో 25 రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాలను నిర్మించారు. వీటిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం స్టాలిన్ ప్రారంభించారు. ఈకార్యక్రమంలో మంత్రి కె.కె.ఎస్.ఆర్. రామచంద్రన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment