నీళ్ల ట్యాంకర్ యజమాని దారుణ హత్య
సేలం: గంధర్వకోట సమీపంలో ట్యాంకర్ లారీ యజమాని దారుణ హత్య చేసిన నలుగురిని పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. పుదుకోట్టై జిల్లా గంధర్వకోట సమీపంలోని వీరడిపట్టికి చెందిన రాజగోపాల్ (50). ఈయన తనకు సొంతమైన లారీలో నీటి ట్యాంకర్‌తో వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం వీరడిపట్టిలో నీటిని నింపి తర్వాత గంధర్వకోట వైపుగా లారీని రాజగోపాల్ నడిపాడు. లారీ గంధర్వకోట రోడ్డుపై వస్తుండగా నలుగురు గుర్తు తెలియని ముఠా లారీని అడ్డుకుని నిలిపి రాజగోపాల్‌పై దాడి చేసి, తర్వాత రాజగోపాల్‌ను కింద పడవేసి పెద్ద బండరాయిని ఆయనపై వేసి హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రాజగోపాల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పుదుకోట్టై ప్రభుత్వ ఆస్పత్రికి శవపంచనామా నిమిత్తం తరలించారు. ఈక్రమంలో రాజగోపాల్‌ను హత్య చేసిన విషయం తెలుసుకుని ఆయన బంధువులు, గ్రామస్తులు గుంపుగా చేరి రోడ్డు పై లారీని ఉంచి ఆందోళన చేపట్టారు. రాజగోపాల్‌ను హత్య చేసిన నలుగురిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment