సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 8న రాష్ట్ర పర్యటనకు రానున్నారు. వరంగల్ జిల్లాలో రైల్వే వ్యాగన్ ఓవర్ హాలింగ్ వర్క్‌షాపునకు శంకుస్థాపన, మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు భూమిపూజ సహా పలు కీలక అభివృద్ధి పనుల్లో పాల్గొననున్నారు. ఇటీవలి వరకు దూకుడుగా వ్యవహరించిన రాష్ట్ర బీజేపీలో ఒక్కసారిగా జోష్ తగ్గిపోయిన సమయంలో ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో రాష్ట్ర బీజేపీలో స్తబ్ధతను పోగొట్టడం, కేడర్‌లో ఉత్సాహం నింపడం లక్ష్యంగా ప్రధాని పర్యటన జరగనున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రధాని మోదీ పార్టీ తరఫున అసెంబ్లీ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారని.. ఎన్నికలకు ఏ విధంగా సిద్ధంకావాలనే దానిపై రాష్ట్ర పార్టీకి స్పష్టంగా దిశానిర్దేశం చేస్తారని అంటున్నాయి.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లను ఎదుర్కొనేలా..
రాష్ట్రంలో అధికార బీఆర్‌ఎస్ ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు, హైకమాండ్ ఫోకస్‌తో రాష్ట్ర కాంగ్రెస్‌లోనూ దూకుడు కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ఆ రెండు పార్టీలను ఎదుర్కొనేలా రాష్ట్ర బీజేపీలో ఉత్సాహం నింపేందుకు మోదీ పర్యటన ఉపయోగపడుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇటీవలే భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ.. తెలంగాణసహా దేశవ్యాప్తంగా కుటుంబ రాజకీయాలు సాగుతున్న తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టారు.
రాష్ట్ర పర్యటనలోనూ ఆయన ఇదే అంశాన్ని మరోసారి బలంగా ఎత్తిచూపుతూ.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లపై విమర్శలు గుప్పిస్తారని కాషాయ వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా కేసీఆర్ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ.. అవినీతి, అక్రమాలు, ప్రభుత్వ వైఫల్యాలు, ముఖ్యమైన ఎన్నికల హామీలను నిలబెట్టుకోకపోవడం వంటి అంశాలపై ధ్వజమెత్తుతారని అంటున్నాయి. మొత్తంగా రాష్ట్ర బీజేపీలో నవోత్సాహాన్ని నింపేందుకు మోదీ పర్యటన దోహదపడుతుందని స్పష్టం చేస్తున్నాయి.
ఇప్పటికే రాష్ట్రానికి రావాల్సి ఉన్నా..
మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రచారం కోసం దేశవ్యాప్తంగా చేపట్టిన ‘మహా జన సంపర్క్ అభియాన్’లో భాగంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ నెలలోనే రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల అమిత్‌షా ఖమ్మం సభ రద్దుకాగా.. విదేశ పర్యటన, ఇతర కార్యక్రమాల కారణంగా మోదీ కూడా రాలేదు.
ఈ క్రమంలోనే వచ్చే నెల 8న ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన ఖరారైనట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇప్పటిదాకా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బీజేపీ అగ్రనేతలు, కేంద్ర మంత్రుల పర్యటనలు సాగినందున.. ఉమ్మడి వరంగల్ పరిధిలోనూ ఓ భారీ సభ, ఇతర కార్యక్రమాల నిర్వహణకు బీజేపీ మొగ్గుచూపినట్టు సమాచారం.
సన్నాహాలు మొదలుపెట్టిన నేతలు
మరో నాలుగైదు నెలల్లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మోదీ పర్యటనకు మరింత ప్రాధాన్యత కనిపిస్తోంది. ఈ పర్యటనను రాజకీయంగా ఉపయోగించుకునేందుకు.. పార్టీకి అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కార్యాచరణ ప్రారంభించింది. మోదీ పర్యటన ఏర్పాట్లు, సభకు జన సమీకరణ, ఇతర అంశాలపై కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర రాష్ట్ర నాయకులతో సమన్వయ చర్యలు మొదలుపెట్టారు.
మోదీ హనుమకొండ సభను విజయవంతం చేయడం ద్వారా.. పార్టీలో కొన్నిరోజులుగా కొనసాగుతున్న గందరగోళ పరిస్థితిని దూరం చేయాలనే ఉద్దేశంతో సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. ఇక మోదీ పర్యటన నేపథ్యంలో వచ్చే నెల 8న హైదరాబాద్‌లో జరగాల్సిన బీజేపీ 11 రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శుల సమావేశాన్ని వాయిదా వేశారు.
మోదీ పర్యటన ఇలా..
వచ్చే నెల 8న (శనివారం) మోదీ రాష్ట్ర పర్యటన వస్తారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో వరంగల్ జిల్లా కాజీపేట మండలం మడికొండ–అయోధ్యపురం గ్రామాల మధ్య రైల్వే వ్యాగన్ ఓవర్ హాలింగ్ వర్క్‌షాప్ నిర్మాణ స్థలానికి చేరుకుని శంకుస్థాపన చేస్తారు. తర్వాత వరంగల్ భద్రకాళి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు.
అక్కడి నుంచి వరంగల్ జిల్లా సంగెంకు వెళ్లి మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు భూమిపూజ చేస్తారు. సాయంత్రం హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. ఈ పర్యటన సందర్భంగా కాజీపేట–కరీంనగర్ కొత్త రైల్వే మార్గానికి కూడా మోదీ శంకుస్థాపన చేయవచ్చని తెలిసింది.
Telangana: బీజేపీకి బూస్టర్ డోస్!
Published Fri, Jun 30 2023 3:14 AM | Last Updated on Fri, Jun 30 2023 8:24 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment