Live Updates..
►రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్ర తర్వాత తెలంగాణకు రావడం సంతోసంగా ఉంది. మా ఐడియాలజీ దేశాన్ని కలపడం. ఇతరులది దేశాన్ని విభజించడం. దేశమంతా భారత్ జోడో యాత్రను సమర్ధించింది. తెలంగాణకు వచ్చినప్పుడు నా యాత్రకు శక్తినిచ్చారు. మీ మనసుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకే మీరు కాంగ్రెస్ ఆలోచనను సమర్ధించారు. పాదయాత్ర చేసిన భట్టిని అభినందిస్తున్నా. పొంగులేటిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తున్నా. తెలంగాణ ఒక స్పప్నంగా ఉండేది. జోడోయాత్రతో విద్వేషాన్ని తొలగించే ప్రయత్నం చేశాం. కాంగ్రెస్ కార్యకర్తలు పులుల్లాగా విజృంభిస్తున్నారు’ అని స్పష్టం చేశారు.
►భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పీపుల్స్ మార్చ్ పాదయాత్రను మార్చి 16వ తేదీన ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలుపెట్టాను. పీపుల్స్ మార్చ్ అనేది భట్టి విక్రమార్క్ యాత్ర కాదు.. అధికార మదంతో విర్రవీగుతున్న వారికి వ్యతిరేకంగా చేపట్టిన యాత్ర ఇది. బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన యాత్ర ఇది. భారత్ జోడో యాత్రు కొనసాగింపే పీపుల్స్ మార్చ్.
రాష్ట్ర సంపదను కేసీఆర్ కొల్లగొడుతున్నారు. పోడు రైతులను అడవుల నుంచి వెళ్లగొట్టేందుకు యత్నించారు. కేసీఆర్‌ది చేతల ప్రభుత్వం కాదు.. మాటల ప్రభుత్వం. ధరణిని రైతులు వ్యతిరేకిస్తున్నారు. మన రాష్ట్రం మనకు వస్తే భూములు వస్తాయని ప్రజలు అనుకున్నారు. ధరణి అనే మహమ్మారిని తీసుకొచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు గళం విప్పారు. పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల కష్టాలను తెలుసుకున్నా. భారతదేశాన్ని ఒక్కటి చేయాలని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారు’ అని పేర్కొన్నారు.
►కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం సభలో పొంగిలేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. మోసపూరిత హామీలతో రెండుసార్లు కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. రైతు రుణమాఫీ హామీని కేసీఆర్ నెరవేర్చలేదు. తెలంగాణ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే’’ అని పొంగులేటి అన్నారు.
► ‘తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. విద్యార్థుల పోరాటాలతో ఆమె తెలంగాణ ఇచ్చారు. రెండుసార్లు కేసీఆర్‌కు అధికారం ఇచ్చారు.. అయినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు.. ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. తెలంగాణ వచ్చినా 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వచ్చేది కాంగ్రెస్ పభుత్వమే. ఆరు నెలల పాటు అందన్నీ కలిశాం. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలన్నీ నెరేవేర్చుతాం. బీఆర్‌ఎస్‌ను బంగాళాఖాతంలో కలిపేయడం కాంగ్రెస్‌కే సాధ్యం. రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడానికి కృషి చేయాలి’ అని పేర్కొన్నారు.
►రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేరారు. కాంగ్రెస్ కండువా కప్పిన రాహుల్.. పార్టీలోకి ఆహ్వానించారు. పొంగులేటితో పాటు పిడమర్తి రవి, అరికెల నర్సారెడ్డి, పాయం వెంకటేశ్వర్లు, కనకయ్య, డీవీ రావు, పాపిరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.
► రాహుల్ గాంధీ ఖమ్మం చేరుకున్నారు. కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ జనగర్జన సభలో ప్రసంగించనున్నారు.
►గన్నవరం ఎయిర్‌పోర్టుకు రాహుల్ గాంధీ చేరుకున్నారు. కాసేపట్లో గన్నవరం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఖమ్మంకు ఆయన చేరుకోనున్నారు.
►కాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ జనగర్జన సభ ప్రారంభం కానుంది. సభకు జనం భారీగా తరలివస్తున్నారు. సాయంత్రం 5.30కి సభా ప్రాంగణం వద్దకు రాహుల్ గాంధీ చేరుకోనున్నారు. జనంతో సభా ప్రాంగణం సందడిగా మారింది. రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లోకి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేరనున్నారు.
► ప్రజా గాయకుడు గద్దర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ విధానాలు నాకు నచ్చాయి. ఈరోజు కాంగ్రెస్‌లో నేను చేరగలను.. కానీ, నేను పార్టీ పెట్టాను. వచ్చే ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్, బీజేపీ ఉండవు.
► సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో నేతల్లో భిన్నాభిప్రాయాలే.. వర్గ విభేదాలు లేవు. జనగర్జన సభకు రాకుండా ప్రజలను అడ్డుకోవడం సరికాదు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 90-100 సీట్లు వస్తాయి.
► ఖమ్మంలో ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. బారికేడ్ల ఏర్పాటుపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ సభకు వస్తున్న కార్యకర్తలను అడ్డుకుంటున్నారని నేతలు ఆరోపిస్తున్నారు.
► జనగర్జన సభకు వచ్చే వాహనాలను పోలీసులు అడ్డుకుంటున్నారు.
► జూలూరుపాడు, సుజాతనగర్‌లో చెక్‌పోస్టులు పెట్టి పోలీసులు అడ్డుకుంటున్నారు.
► పాల్వంచ, కొత్తగూడెం తదితర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి.
► తనిఖీల పేరుతో వాహనాల పత్రాలు లేకపోతే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో, పొంగులేటి అభిమానులు దిక్కుతోచని పరిస్థితుల్లో అక్కడే ఉండిపోతున్నారు.
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో తిరిగి పట్టు పెంచుకుని అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహణకు సిద్ధమైంది.
► తెలంగాణ జనగర్జన సభను పురస్కరించుకుని కాంగ్రెస్‌లో కోలాహలం నెలకొంది.
► సీనియర్లు అంతా ఏకతాటికిపై వస్తుండటం.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన అనుచరులు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరుతుండటం.. సీనియర్ నేత భట్టి విక్రమార్క చేపట్టిన ‘పీపుల్స్ మార్చ్’ పాదయాత్ర ముగుస్తుండటం నేపథ్యంలో దీనికి ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది.
► ఐదు లక్షల మందికిపైగా జనాన్ని సమీకరించేందుకు అంతా సిద్ధం చేసింది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ సభలో పాల్గొని.. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించనున్నారు.
► ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ జనగర్జన సభకు హాజరుకానున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో సాయంత్రం 5:30 గంటలకు సభా ప్రాంగణానికి రాహుల్ విచ్చేస్తారని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. సభ ముగిశాక రోడ్డు మార్గంలో గన్నవరం వెళ్లి అక్కడ నుంచి ఢిల్లీ వెళ్తారని వివరించాయి.
► ఈ సభకు ఏర్పాట్లు పూర్తికాగా.. నగరం మొదలు సభా ప్రాంగణం వరకు భారీ కటౌట్లు, పార్టీ తోరణాలతో ముస్తాబు చేశారు.
► గతంలో ఎన్నడూ లేని విధంగా సభకు భారీగా జన సమీకరణ చేస్తుండగా.. దాదాపు ఐదు లక్షల మందిని తరలించేందుకు ప్రైవేట్ వాహనాలను సిద్ధం చేశారు.
► 55 అడుగుల ఎత్తులో 144 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పుతో 200 మంది కూర్చొనేలా సభా వేదికను నిర్మించారు. 140 అడుగుల పొడవు, 40 అడుగుల ఎత్తులో భారీ డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. సభాస్థలిని 100 ఎకరాల్లో ఏర్పాటు చేయగా వేదిక ముందు 1.50 లక్షల మంది కూర్చొని వీక్షించేలా గ్యాలరీలు, కుర్చీలు సిద్ధం చేశారు. అలాగే మిగతా వారు సభను వీక్షించేలా 12 భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయడంతోపాటు మరో 4 లక్షల మంది నిల్చొని చూసేలా బారికేడ్లు ఏర్పాటు చేశారు.
కీలక ప్రకటనకు అవకాశం..
ఈ సభతోనే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనుంది. రానున్న ఎన్నికల్లో అనుసరించే రాజకీ య వ్యూహం, ఇతర పార్టీలతో పొత్తులు, ప్రజలకు ఇవ్వాల్సిన హామీలపై ఈ వేదిక నుంచే రాహుల్ కీలక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment