ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో అనాథలకు 2 % కోటా | 2 percent quota for orphans in government schools and colleges | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో అనాథలకు 2 % కోటా

Published Wed, Jan 3 2024 4:33 AM | Last Updated on Wed, Jan 3 2024 4:33 AM

2 percent quota for orphans in government schools and colleges - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో తల్లిదండ్రులు లేనివారికి (అనాథలు) రెండు శాతం కోటా కేటాయించేందుకు కసరత్తు చేయాలని అధికారులను రాష్ట్ర పీఆర్, మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. పిల్లలను దత్తత తీసుకునేందుకు అనేకమంది ఆసక్తి కనబరుస్తున్నా, నిబంధనలు కఠినంగా ఉండడంతో ఎక్కువమంది ముందుకు రావడం లేదన్నారు. దీనికి సంబంధించిన నిబంధనలను కూడా సులభతరం చేయాలని సూచించారు. అంగన్‌వాడీలకు వచ్చే పాలను సాధ్యమైనంత వరకు మండల కేంద్రాల్లో ఉన్న డెయిరీల ద్వారా సేకరించాలని, ఇందుకు ఒక పైలట్‌ ప్రాజెక్టు చేపట్టాలని ఆదేశించారు.

మంగళవారం సచివాలయంలో మహిళ, శిశు సంక్షేమశాఖపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పిల్లల రక్షణ యూనిట్స్‌కు ట్రైనింగ్‌ ఇవ్వాలని, ఎన్జీవోల ఆధ్వర్యంలో నడిచినా డిపార్ట్‌మెంట్‌ నియంత్రణ ఉండాలన్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఒకటి, రెండు రోజుల పనికోసం వచ్చే వర్కింగ్‌ ఉమెన్‌కు ముఖ్యమైన పెద్ద నగరాల్లో శాఖాపరంగా  హాస్టళ్లు ఏర్పాటు చేసే ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.

ప్రతి జిల్లాలో వృద్ధాశ్రమాలు కూడా  ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల దగ్గరే అంగన్‌వాడీ కేంద్రాలు ఉండేవిధంగా అధికారులు చొరవ చూపాలనన్నారు. ఈ సందర్భంగా శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా మంత్రికి వివరించారు. ఈ సమావేశంలో మహిళ, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వాకాటి కరుణ,   ఇతర అధికారులు పాల్గొన్నారు. 

‘స్త్రీ నిధి’ దుర్వినియోగంపై విచారణ కమిటీ
అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం
సాక్షి, హైదరాబాద్‌: స్త్రీ నిధి పథకంలో నిధుల దుర్వినియోగం ఫిర్యాదులపై శాఖాపరమైన విచా రణ కమిటీని ఏర్పాటు చేయాలని అధికా రులను పంచాయతీరాజ్, మహిళా శిశుసంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) ఆదేశించారు. ఈ నిధులు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవా లని సూచించారు. ఈ నిధుల దుర్వినియోగంపై ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వస్తున్న ఆరోపణలు, జరిగిన ప్రచారం వల్ల దీనిపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉందని, ఈ నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

మంగళవారం సచివా లయంలో స్త్రీనిధి క్రెడిట్‌ కో ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌పై సమీక్ష సందర్భంగా సీతక్క మాట్లాడుతూ, స్త్రీనిధిలో పెండింగ్‌లో ఉన్న అన్ని లోన్లను వెంటనే క్లియర్‌ చేయాలని,  మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజలకు రుణాలు ఎక్కువ ఇచ్చేలా చొరవ చూపాలని సూచించారు. హైవేలతో పాటు ఇతర ప్రధానమైన రోడ్లకు ఇరుపక్కల వివిధ రకాల పండ్లు, కూరగా యలు, ఇతర వస్తువులు అమ్ముకునే వారికి షెడ్స్‌ ఏర్పాటు ద్వారా మరింత ఉపాధి పొందటానికి అవ కాశం ఉంటుందని చెప్పారు. ఈ తరహా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

ట్రైబల్‌ ఏరియాలో ఎలాంటి అవసరాలు ఉన్నాయో గుర్తించేందుకు అవసరమైన అధ్యయనం చేయాలని సూచించారు. మహిళలు వంద శాతం స్వయం సహాయక సంఘాలలో జాయిన్‌ అయ్యేలా చూడాలని ఆదేశించారు. ఇక నుంచి ప్రతినెలా ఒకసారి సమీక్షా సమావేశం ఉంటుందని, మహిళల ఆర్థిక సాధికారికత పెంచేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. సమావేశంలో పీఆర్, ఆర్‌డీ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, మహిళ, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వాకాటి కరుణ, స్త్రీనిధి డైరెక్టర్‌ విద్యాసాగర్‌రెడ్డి పాల్గొన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement