సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గురువారం 61,863 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 2,932 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,17,415కు చేరిందన్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఆయన బులెటిన్ విడుదల చేశారు. ఒక్కరోజే కరోనాతో 11 మంది మృతి చెందారన్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా మరణాల సంఖ్య 799కి చేరిందన్నారు. కరోనా బారి నుంచి ఒక్క రోజులోనే 1,580 మంది కోలుకున్నారన్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 87,675కి చేరిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 28,941 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆయన తెలిపారు. ఇందులో 22,097 మంది ఇళ్లు లేదా ఇతరత్రా సంస్థల్లో ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో 12,04,343 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.
జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా 520 కేసులు...
ఒక్కరోజులో వచ్చిన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 520 నమోదయ్యాయి. ఆ తర్వాత రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 218 చొప్పున నమోదయ్యాయి. కరీంనగర్ 168, నల్లగొండ 159, ఖమ్మం 141, నిజామాబాద్ 129, జగిత్యాల 113, మంచిర్యాల 110, సూర్యాపేట 102, సిద్దిపేట 100, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 89 కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే 42 ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం 7,952 కరోనా పడకలుంటే, వాటిల్లో 2,579 నిండిపోయాయి. ఇంకా 5,373 పడకలు ఖాళీగా ఉన్నాయి. ఇక 172 ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో 9,160 పడకలు ఉండగా, అందులో 4,265 నిండిపోయాయి. ఇంకా 4,895 పడకలు ఖాళీగా ఉన్నాయని వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది.
కోవిడ్ భయంతో ఇంటి యజమాని ఆత్మహత్య
అద్దెకు ఉన్న దంపతులకు పాజిటివ్‌తో ఆందోళన
ఇంట్లో అద్దెకున్న వారికి కరోనా సోకడంతో ఆ ఇంటి యజమానురాలు ఆందోళన చెంది ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన శుక్రవారం హైదరాబాద్ మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మూసారాంబాగ్ డివిజన్ శాలివాహననగర్‌లో సురేందర్‌కుమార్ విజయ్ వర్గియ, ఆరాధన విజయ్ వర్గియ దంపతులు నివసిస్తున్నారు. వారి ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌ను ఓ జంటకు అద్దెకిచ్చారు. అయితే ఆ భార్యాభర్తలకు కోవిడ్–19 పాజిటివ్ వచ్చింది. దీంతో ఆరాధన విజయ్ వర్గియ భయాందోళన చెందింది. డిప్రెషన్‌లోకి వెళ్లింది. ఈ క్రమంలోనే ఈనెల 26న బొద్దింకల నివారణ మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఈ విషయం గమనించి కుటుంబసభ్యులు ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది.
Comments
Please login to add a commentAdd a comment