సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త వేరియంట్ కేసులు మొత్తంగా ఏడుకు చేరాయి. తొలి మూడు కేసులు వచ్చిన మరునాడే మరిన్ని కేసులు నమోదవడం ఆందోళనకరంగా మారింది. వీరంతా కూడా విదేశాల నుంచి వచ్చినవారేనని.. స్థానికంగా ఒమిక్రాన్ కేసులేవీ నమోదు కాలేదని అధికారులు చెప్తున్నారు.
తాజా కేసుల్లో ఒకరు హైదరాబాదీ: బుధవారం నమోదైన మూడు కేసుల్లో ఒకరు సోమాలియాకు, మరొకరు కెన్యాకు చెందినవారుకాగా.. మరొకరు కెన్యా నుంచి వచ్చిన బెంగాలీ. తాజాగా గురువారం వెలుగు చూసిన నాలుగు కేసుల్లో ఒకరు బ్రిటన్ నుంచి వచ్చిన 31 ఏళ్ల హైదరాబాద్ వాసి. యూసఫ్‌గూడ ప్రాంతానికి చెందిన ఆయన.. లండన్ నుంచి దుబాయ్ మీదుగా ఈ నెల 15న హైదరాబాద్‌కు వచ్చినట్టు తెలిసింది. ఇక మిగతా ముగ్గురు కెన్యా దేశస్తులే. వీరిలో ఇద్దరు 24 ఏళ్ల యువతులు, ఒకరు 44 ఏళ్ల పురుషుడు ఉన్నారని.. ఈ నెల 13, 14 తేదీల్లో షార్జా, దుబాయ్ మీదుగా హైదరాబాద్‌కు చేరుకున్నారని అధికారులు చెప్తున్నారు. వారు వైద్య అవసరాల కోసం హైదరాబాద్‌కు వచ్చారని సమాచారం. అయితే వైద్యారోగ్యశాఖ మాత్రం పూర్తి సమాచారం ఇవ్వలేదు.
ముప్పున్న దేశాల నుంచి మరో 120 మంది..
ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఉన్న ‘రిస్క్’దేశాల నుంచి వచ్చిన 120 మంది గురువారం హైదరాబాద్ విమానాశ్రయంలో దిగారు. వారందరికీ పరీక్షలు చేయగా.. ఎవరికీ కరోనా పాజిటివ్ రాలేదు. మొత్తంగా రిస్క్ దేశాల నుంచి ఇప్పటివరకు 6,764 మంది వచ్చారు. అందులో 21 మందికి సాధారణ కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా ఒకరికి ఒమిక్రాన్ ఉన్నట్టు తేలింది. ఇక ‘రిస్క్’లేని దేశాల నుంచి వేలాది మంది రాష్ట్రానికి రాగా.. వారిలో ఆరుగురికి ఒమిక్రాన్ సోకినట్టు వెల్లడైంది. తాజాగా మరో ముగ్గురి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు.
రాష్ట్రంలో మరో 190 కేసులు
గురువారం రాష్ట్రవ్యాప్తంగా 40,103 మందికి కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 190 కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కేసులు 6,79,064కి పెరిగాయి. వైరస్ బారినపడి మరో ఇద్దరు చనిపోగా.. మొత్తం మరణాలు 4,012కు చేరాయి.
Comments
Please login to add a commentAdd a comment