బంధించిన పులిని తరలించేందుకు సిద్ధంగా ఉన్న వాహనం, ఈ మంచెపైనే ఉంటూ పులిపై మత్తు మందు వదలనున్నారు
సాక్షి, మంచిర్యాల : ఇద్దరిని హతమార్చిన పులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఇటీవల ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం దిగిడలో ఓ యువకుడిని, పెంచికల్‌పేట మండలం కొండపల్లికి చెందిన ఓ యువతిపై పులి దాడి చేసి చంపేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలతో పులిని బంధించాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. దీంతో అటవీశాఖ అధికారులు నెల రోజులుగా పులి రాకపోకలను గమనిస్తూ.. బెజ్జూరు, పెంచికల్‌పేట అడవుల్లో 10 బోన్లు, 100కు పైగా సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. ఎర వేసిన పశువులను తింటున్న పులి.. బోనులోకి మాత్రం వెళ్లడం లేదు. దీంతో మత్తు మందు ప్రయోగించి బంధించాలని నిర్ణయించారు. ఇందుకు చంద్రాపూర్ ర్యాపిడ్ యాక్షన్ టీంకు చెందిన ఆరుగురు అధికారులు, హైదరాబాద్ నుంచి షూటర్లను రప్పించి ఆపరేషన్ ప్రారంభించారు. కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్టు డైరెక్టర్ వినోద్‌కుమార్ సహా జిల్లా అటవీ అధికారి శాంతారాం, కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో విజయ్‌కుమార్, 100 మంది వరకు అటవీ అధికారులు ఈ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. మరోవైపు పులిని బంధించడంపై అధికారులు పూర్తి గోప్యత పాటిస్తున్నారు. చదవండి: బోరు వేయని బోరిగాం.. అదెలా సాధ్యమంటారు?
మంచెపై ఉంటూ మత్తు ప్రయోగం
పులి తరచూ సంచరించే బెజ్జూరు రేంజ్ తలాయి బీట్ పరిధిలోని కంది భీమన్న అటవీ ప్రాంతంలో ఎరగా ఓ పశువును చెట్టుకు కట్టేసి ఉంచారు. ఎరపై పులి ఈ నెల 11న దాడి చేసి ఆకలి తీర్చుకుంది. మరోమారు మిగిలిన మాంసం తినేందుకు వచ్చింది. రెండుసార్లు అక్కడికి వచ్చినప్పటికీ పక్కనే బోనులోకి మాత్రం వెళ్లడం లేదని అధికారులు గుర్తించారు. ఇదే ప్రాంతానికి మళ్లీ పులి వచ్చేలా బుధవారం మరో పశువును ఎరగా ఉంచారు. ఎర ఉన్న ప్రాంతానికి 20 మీటర్ల దూరంలోనే తాత్కాలిక మంచె ఏర్పాటు చేశారు. ఈ మంచెలో షూటర్లు ఉంటూ పులి రాగానే తుపాకీతో మత్తు మందు వదిలేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం అడవిలో రాత్రి వేళల్లోనూ మంచెపైనే ఉంటూ పర్యవేక్షిస్తున్నారు. మత్తు మందు ఇచ్చాక స్పృహ కోల్పోయినట్లు నిర్ధారించుకున్నాకే పులిని ప్రత్యేక వాహనంలో వేరే ప్రాంతానికి తరలించనున్నారు. చదవండి: ఏ పులి ఎక్కడ తిరుగుతుందో!
Comments
Please login to add a commentAdd a comment