కొన్నేళ్ల క్రితం కాలిఫోర్నియాలో కమలా పండ్లు గడ్డకట్టిపోయేంత స్థాయిలో మంచు కురిసింది. అలాగే ఆఫ్రికాలోని సహారా ఎడారిపై మంచు దుప్పటిలా పరుచుకుంది. అసాధారణ రీతిలో కొన్నిచోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు.. ఇంకొన్ని చోట్ల వెన్ను వణికించే స్థాయిలో చల్లదనం కనిపించాయి కూడా. ఇవన్నీ యాదృచ్ఛికం అనుకునేందుకు వీల్లేదంటున్నారు శాస్త్రవేత్తలు. భూమి మొత్తాన్ని ప్రభావితం చేయగలిగిన శక్తి ఉన్న సూర్యుడిపై జరిగే కార్యకలాపాలకూ వీటికి సంబంధం ఉందన్నది వీరి వాదన.
సన్‌స్పాట్స్‌కు, మంచుకు లింకేంటి?
సన్‌స్పాట్స్‌లో హెచ్చుతగ్గులకు.. భూమిపై మంచు పడేందుకు సంబంధం ఉంది. సన్‌స్పాట్స్ ఎక్కువ ఉన్నప్పుడు సూర్యుడిపై జరిగే పేలుళ్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. పేలుళ్ల తీవ్రత ఎక్కువగా ఉంటే సూర్యుడి నుంచి ఎగజిమ్మే ప్లాస్మా కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ అధిక ప్లాస్మాలోని కణాలు కాస్తా భూ అయస్కాంత క్షేత్రాన్ని ప్రభావితం చేస్తాయి. ఫలితంగా వాతావరణం పైపొరల్లో భారీస్థాయి మేఘాలు ఏర్పడతా యని అంచనా. సూర్యరశ్మి తగ్గిపోయేందుకు, అదే సమయంలో అధిక వర్షాలు/వరదలకూ ఇది కారణమవుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్య రశ్మి తగ్గిపోతే భూ ఉష్ణోగ్రతలూ తగ్గిపోతాయి.
ఎంత? ఎక్కడ? ఎలా?
1645 నాటి పరిస్థితులను తీసుకుంటే.. అప్పట్లో సూర్యుడి నుంచి వెలువడే శక్తి ప్రతి చదరపు మీటర్‌కు మూడు వాట్ల వరకూ తగ్గిందని లెక్క. ఈ చిన్న మార్పుకే బ్రిటన్ మొదలుకొని అనేక యూరోపియన్ దేశాలు మంచులో కూరుకుపోయాయి. నదులు గడ్డకట్టిపోయాయి. శీతాకాలం ఎక్కువ సమయం కొనసాగింది. సూర్యుడిపై సన్‌స్పాట్స్ వేగం పుంజుకోకపోతే ఈసారి కూడా భూమి సగటు ఉష్ణోగ్రత ఒక డిగ్రీ సెల్సియస్ వరకూ పడిపోతుందని అంచనా. అదే జరిగితే భూ ఉత్తరార్ధ గోళంలో చాలాదేశాల్లో మంచు ప్రభావం చాలా ఎక్కువ అవుతుంది. ఆర్కిటిక్, అంటార్కిటికా ప్రాంతాల్లోనూ మంచు కురవడం ఎక్కువ అవుతుంది.
2020 సెప్టెంబర్ తరువాత సన్‌స్పాట్స్ ఏర్పడటం కొంచెం ఎక్కువైనప్పటికీ.. 2023 నాటికి అది పతాకస్థాయికి చేరుకుని 2030 నాటికి కనిష్టానికి చేరతాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. సూర్యుడి నుంచి వెలువడే రేడియోధార్మికత రానున్న 30 ఏళ్లలో ఏడు శాతం వరకూ తక్కువ కావొచ్చని అంటున్నారు. అయితే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) మాత్రం ఇలాంటి పరిస్థితి వచ్చే అవకాశమే లేదని అంటోంది. సన్‌స్పాట్స్ తగ్గినా.. దాని ప్రభావం కంటే కాలుష్యం కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం ఆరు రెట్లు ఎక్కువని చెబుతోంది. అంటే.. సూర్యుడిపై ఏర్పడే మచ్చలు వందేళ్లపాటు తక్కువగా ఉన్నా.. భూమి ఉష్ణోగ్రతలు మాత్రం పెద్దగా తగ్గవని అంటోంది.
అంతా సూర్య భగవానుడి మహత్తు..
► మినీ మంచుయుగం గురించి అర్థం చేసుకోవాలంటే సూర్యుడి గురించి కొంచెం వివరంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అయ స్కాంత శక్తి తీవ్రతల్లో తేడాల కారణంగా సూర్యుడిపై పెద్ద పెద్ద పరిమాణాల్లో మచ్చల్లాంటివి ఏర్పడుతుంటాయి. వీటి సంఖ్య కొన్నేళ్లు పెరుగుతూ.. ఇంకొన్నేళ్లు తగ్గుతూ ఉంటాయి. ఈ కాలాన్ని సోలార్ సైకిల్ అం టారు. 1912 నుంచి 24 సోలార్ సైకిల్స్ పూర్తి కాగా.. ఇప్పుడు 25వ సైకిల్ నడుస్తోంది. 2019లో వందేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువస్థాయిలో సన్‌స్పాట్స్ ఏర్పడగా ఆ తరువాతి ఏడాది పెరగడం మొదలవుతుందని శాస్త్రవేత్తలు లెక్కలేశారు. కానీ, 2020 సెప్టెంబర్ వరకూ ఈ సన్‌స్పాట్స్ పెరగలేదు. అప్పుడెప్పుడో 1645–1710 సంవత్సరాల మధ్య ఇలాగే సూర్యుడిపై అతి తక్కువ సన్‌స్పాట్స్ ఏర్పడ్డాయని.. మాండర్ మినిమం అని పిలిచే ఈ కాలంలోనే భూ ఉత్తరార్ధ గోళం మంచులో మునిగిపోయిందని చెబుతున్నారు. అందుకే ఈసారి కూడా అలాగే జరిగే అవకాశం ఉందన్న అంచనా ఏర్పడింది.
Comments
Please login to add a commentAdd a comment