సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాక్సినేషన్ మూడోరోజే ఒకరు మృతి చెందడంతో రాష్ట్రం యావత్తూ ఉలిక్కిపడింది. నిర్మల్ జిల్లాలో ‘108’అంబులెన్స్ డ్రైవర్ వ్యాక్సిన్ వేసుకున్న రోజు (మంగళవారం) అర్ధరాత్రి దాటిన తర్వాత ఉన్నట్లుండి చనిపోవడంతో వైద్య ఆరోగ్యశాఖలో ఆందోళన మొదలైంది. అనారోగ్యం కారణంగానే ఆయన చనిపోయారా? మరేదైనా పరిస్థితులు మరణానికి దారితీశాయా? అనే కోణంలో లోతుగా విచారణ మొదలైంది. అంబులెన్స్ డ్రైవర్ ఉదయం వ్యాక్సిన్ వేసుకున్నా... రోజంతా బాగానే ఉన్నాడు. అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అతను చనిపోయాడని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. వ్యాక్సిన్‌కు, అతను చనిపోవడానికి ఎలాంటి సంబంధం లేదని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు.
అనారోగ్యం వల్లే అతను చనిపోయాడా? లేదా మానవ తప్పిదంతో ఏమైనా జరిగిందా అన్న కోణాల్లోనూ సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఉత్తరప్రదేశ్, కర్ణాటకల్లో ఇప్పటివరకు వ్యాక్సిన్ వేసుకున్నాక చనిపోయిన సంఘటనలు ఒక్కొక్కటి చొప్పున జరిగాయని, తెలంగాణలో మూడో సంఘటన అని అధికారులు తెలిపారు. దీంతో దేశంలో వ్యాక్సిన్ అనంతరం చనిపోయిన వారి సంఖ్య మూడుకు చేరింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ నిర్మల్ సంఘటనపై ఆరా తీసింది. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో మూడు రోజుల్లో 77 మందికి సైడ్ ఎఫెక్ట్స్ రాగా, అందులో నలుగురు ఆసుపత్రిలో చేరారు. చదవండి: (ఒక్కసారి తిరస్కరిస్తే.. మళ్లీ నో కరోనా వ్యాక్సిన్!)
మానవ తప్పిదం ఏమైనా ఉందా?
ఒకవేళ వ్యాక్సిన్‌లో లోపాలుంటే ఒకే బ్యాచ్‌కు చెందిన టీకా వేసుకున్న వారందరికీ సైడ్‌ఎఫెక్ట్స్ రావాల్సి ఉంది. ఒక వయల్‌తో 10 మందికి టీకా వేయవచ్చు. కాబట్టి వయల్ నిర్వహణ, నిల్వలో తేడాలుంటే మరికొందరికి కూడా రియాక్షన్లు వస్తాయి. కానీ నిర్మల్ సంఘటనలో అలాంటిది ఏమీ జరగలేదు. చనిపోయిన వ్యక్తి ఉదయం 11.30 గంటలకు వ్యాక్సిన్ వేసుకుంటే, ఆ రోజు అర్ధరాత్రి 2.30 గంటలకు గుండెపోటుకు గురయ్యాడు. అప్పటి వరకు అతను సాధారణంగానే ఉన్నాడు. ఒకవేళ వ్యాక్సిన్ సైడ్‌ఎఫెక్ట్స్ ఇస్తే దాని ప్రభావం వెంటనే ఉంటుందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కాబట్టి వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఈ సంఘటన జరిగి ఉండకపోవచ్చని భావిస్తున్నట్లు చెబుతున్నారు. సాధారణంగా వ్యాక్సిన్లలో లోపాలుంటే వికటిస్తాయి.
కానీ మన వ్యాక్సిన్లు ఎంతో భద్రతా ప్రమాణాలు ఉన్నవన్నారు. ఇక కొన్నిసార్లు మానవ తప్పిదంతో మూడు రకాలుగా వ్యాక్సిన్లు వికటిస్తుంటాయని డాక్టర్ శ్రీనివాసరావు విశ్లేషించారు. ఒకటి వ్యాక్సిన్లను సరైన ఉష్ణోగ్రతలో ఉంచకపోవడం వల్ల దాన్ని వేసుకున్న వారికి రియాక్షన్లు వచ్చే అవకాశం ఉంది. రెండోది అవసరం లేకపోయినా ఒక్కోసారి ఫ్రీజర్ల నుంచి ఎక్కువ వ్యాక్సిన్లు తీసి బయట పెడుతుంటారు. అప్పుడూ వ్యాక్సిన్ వికటించే అవకాశం ఉంది. ఇక మూడోది వ్యాక్సిన్‌ను కండరానికి కాకుండా ఇంకోచోట పొరపాటున వేయడం వల్ల కూడా ఒక్కోసారి వికటిస్తుందని ఆయన తెలిపారు. ఈ మూడు కోణాల్లోనూ నిర్మల్ ఘటనను విచారిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు పోస్ట్‌మార్టం రిపోర్ట్ తర్వాత కూడా కొన్ని విషయాలు తమకు అవగతమవుతాయని తెలిపారు. సైడ్‌ఎఫెక్ట్స్ మేనేజ్‌మెంట్ జిల్లా టీంలో 15 మంది నిపుణులు ఉండగా, గుండెపోటుతో చనిపోయిన నేపథ్యంలో ఒక కార్డియాలజిస్ట్‌ను కూడా ఆ బృందంలో చేర్చినట్లు శ్రీనివాసరావు తెలిపారు.
ప్రతికూల ప్రభావంపై ఆందోళన
‘సహజంగా ఈ సంఘటన టీకాల కార్యక్రమంపై వ్యతిరేక ప్రభావం చూపుతుంది. ఇతర సార్వత్రిక టీకాల విషయంలోనూ ఇలాంటివి చూశా’మని ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. అయితే వ్యాక్సిన్‌కు, ప్రస్తుతం జరిగిన మృతి సంఘటనకు ఎలాంటి సంబంధం లేదని విరివిగా ప్రచారం చేస్తామని తెలిపారు. వేలు, లక్షల్లో వ్యాక్సిన్లు వేసినప్పుడు యాదృచ్ఛికంగా ఒకటీ అరా ప్రతికూల సంఘటనలు జరుగుతుంటాయి. అంతమాత్రాన దాన్ని వ్యాక్సిన్‌కు ముడిపెట్టడం సరికాదు. ప్రస్తుతం టీకా వేసుకుంటున్న వైద్య సిబ్బంది ఈ విషయాన్ని అర్థం చేసుకుని సాధారణ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని డాక్టర్ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment