
సాక్షి, హైదరాబాద్: ఒమిక్రాన్ వేరియంట్ తేలికపాటిదేనని, ప్రమాదకరం కాదని.. ఈ వైరస్ సోకినా పెద్దగా ఇన్ఫెక్షన్లు లేనందున భయపడాల్సిన పని లేదనే భావన ప్రజల్లోకి వెళ్లడం ఆందోళన కలిగించే విషయమని అపోలో గ్రూప్ హాస్పిటల్స్ ప్రెసిడెంట్ కె.హరిప్రసాద్ అన్నారు.
ఒమిక్రాన్ వేరియంట్‌పై ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం ప్రమాదకరరీతిలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ వేరియంట్ అయినా ప్రజలు జాగ్రత్తలు పాటిస్తేనే వ్యాప్తిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని సూచించారు. ఒమిక్రాన్ వేరియంట్‌పై జరుగుతున్న వివిధ రకాల ప్రచారం నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో తన అభిప్రాయాలను పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే..
వేగంగా వ్యాప్తి చెందే రకం ఇది
కోవిడ్–19లో ప్రస్తుతం వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ మునుపటి వేరియంట్లతో పోలిస్తే అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుంది. మంచి రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తిలోకి ఈ వైరస్ ప్రవేశిస్తే ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. కానీ ఆ వ్యక్తి నుంచి ఇతరులకు ఈ వైరస్ వేగంగా సోకుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ సోకితే వచ్చే ఇన్ఫెక్షన్ తేలికపాటి లక్షణాలను కలిగిస్తున్నట్లు గుర్తిస్తున్నాం.
ఇది సోకిన ప్రజలు దానిని ఒక చిన్నపాటి జలుబుగా భావిస్తున్నారు. వాస్తవానికి ఒమిక్రాన్ కారణంగా కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది అని తెలియకపోతే, వారు సాధారణ వ్యక్తుల్లాగే బయట సమాజంలో తిరుగుతారు. తద్వారా అనేక మంది ఇతర వ్యక్తులకు ఇన్ఫెక్షన్ సోకే పరిస్థితి ఏర్పడుతుంది.
సాధారణ విషయంగా భావించవద్దు
ఒమిక్రాన్ తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగించదు, మరణాలకు దారితీయదనే భావన ప్రజల్లో క్రమంగా సాధారణంగా మారుతోంది. ప్రస్తుతం ఈ వైరస్ చాలా తక్కువ స్థాయిలో ఉన్నా (అప్పటికే తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు) ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొందరికి ఐసీయూ సంరక్షణ కూడా అవసరమవుతోంది. ఇతర దేశాల్లో మరణాలు కూడా సంభవిస్తున్నట్లు తెలుస్తోంది. డెల్టా అత్యంత ప్రమాదకరమని అందరికీ తెలుసు.
సెకండ్ వేవ్‌లో ఆ వేరియంట్ మనకు భయంకరమైన అనుభవాన్ని మిగిల్చింది. ఇప్పటికీ కోవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. మున్ముందు ఇది భారీ నష్టాలకు కారణమయ్యే అవకాశం ఉందని గ్రహించాలి. వ్యక్తులుగా మన బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలి. పౌరులుగా ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి, అది కలిగించే నష్టాన్ని వీలైనంతగా తగ్గించడానికి ప్రభుత్వానికి సహకరించాలి.
జాగ్రత్తలు పాటించాలి
ప్రతి ఒక్కరూ మాస్కును సరైన రీతిలో ధరించాలి. గుంపులుగా గుమిగూడకుండా.. ఎక్కువ మంది పాల్గొనే సమావేశాలకు దూరంగా ఉండాలి. భౌతిక దూరం పాటించాలి. తక్కువ లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్ష చేయించుకోవాలి. పరిస్థితులను బట్టి ముందస్తుగానే వైద్య సహాయం తీసుకోవాలి. హోమ్ ఐసోలేషన్ పాటించాలి. నిబంధనల ప్రకారం ఇమ్యునైజేషన్ డోస్‌లను (బూస్టర్లతో సహా) తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment