సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లోనూ శ్రమ, ఖర్చును తగ్గిస్తూ అనేక ఆవిష్కరణలు పురుడు పోసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పాడి రైతులు, డెయిరీ ఫారాల నిర్వాహకులు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారంగా ‘ఆటోమేటెడ్ డంగ్ క్లీనర్’రూపుదిద్దుకుంటోంది. టైమ్ సెట్ చేసి వదిలేస్తే... నిర్ధారిత సమయానికి పేడను ఎత్తివేసి పశువుల షెడ్డును శుభ్రం చేసేస్తుంది. ప్రయోగస్థాయిలోనే పలువురి ప్రశంసలు పొందిన ఈ నూతన ఆవిష్కరణ త్వరలో పూర్తిస్థాయిలో పాడి రైతులు, డెయిరీ ఫారాల నిర్వాహకులకు అందుబాటులోకి రానున్నది. కొందరు ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రతిభ, కృషికి ఫలితమిది.
పాడి పరిశ్రమను చేపట్టిన రైతులు, వ్యాపారవేత్తలు డెయిరీ రంగంలో కూలీల కొరతను ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా బిహార్, ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తెచ్చుకోవాల్సి వస్తోంది. షెడ్‌ల నుంచి పేడను ఎత్తి శుభ్రం చేయడం ఖర్చుతో కూడుకున్న పని కూడా. ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ‘డంగ్ క్లీనర్’యంత్రాన్ని రూపొందించారు. డంగ్ క్లీనర్ ప్రోటోటైప్ యంత్రానికి ఇప్పటికే తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, స్థానిక జిల్లా అధికారుల ప్రశంసలు దక్కాయి.
పని చేస్తుందిలా...
►ఇది చక్రాలతో పశువుల కొట్టం అంతటా తిరుగుతూ రోబోటిక్ చేతుల సాయంతో పేడను ఎత్తుతుంది.
►ఎత్తిన పేడను ఓ కంటెయినర్‌లో నింపుకుని నిర్ణీత పరిమాణంకు చేరుకున్న తర్వాత సమీపంలోని కంపోస్ట్ పిట్‌కు చేరవేస్తుంది.
►మీథేన్ గ్యాస్ ఆధారంగా పేడను గుర్తించేలా ఇందులో సెన్సర్లను అమర్చారు.
►యంత్రంలోని రియల్ టైమ్ క్లాక్ ఆధారంగా ఏ సమయంలో షెడ్‌ను క్లీన్ చేయాలో ముందుగానే టైమ్‌ను సెట్ చేయొచ్చు.
►విద్యుత్ చార్జింగ్‌తో పనిచేస్తుంది.రూ.100 నుంచి 150 పశువులున్న డెయిరీని దాదాపు నాలుగు గంటల్లో శుభ్రం చేయగలదు.
Comments
Please login to add a commentAdd a comment