పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి | Arrest of the latest former Sarpanchs who started agitation at Gunpark | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

Published Fri, Feb 23 2024 4:32 AM | Last Updated on Fri, Feb 23 2024 4:32 AM

Arrest of the latest former Sarpanchs who started agitation at Gunpark - Sakshi

నాంపల్లి (హైదరాబాద్‌): సర్పంచ్‌లకు రావాల్సిన పెండింగ్‌ బిల్లులపై ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పాలక, ప్రతిపక్షాలు నోరు మెదపకపోవడం బాధాకరమని తెలంగాణ సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు సుర్వి యాదయ్య ధ్వజమెత్తారు. గురువారం నాంపల్లిలోని గన్‌పార్కు వద్ద తెలంగాణ సర్పంచ్‌ల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన తాజా మాజీ సర్పంచ్‌లు ముందుగా పబ్లిక్‌గార్డెన్స్‌కు చేరుకున్నా రు. అక్కడి నుంచి ర్యాలీగా గన్‌పార్కుకు వచ్చారు. నిరసన సభ ఉద్రిక్తతకు దారితీయకుండా పోలీసులు భారీగా మోహరించారు.

గన్‌పార్కు వద్ద మాజీ సర్పంచ్‌లు నిరసన వ్యక్తం చేసి ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా అక్కడికక్కడే అరెస్టు చేసి, నాంపల్లి పీఎస్‌కు తరలించారు. ఈ సందర్భంగా సుర్వి యాదయ్య విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వం సర్పంచ్‌లను మోసం చేస్తే...అధికారంలోకి రాగానే సర్పంచ్‌లను ఆదుకుంటామన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రస్తుతం పట్టించుకోవడం లేదన్నారు.

ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డిని రెండు పర్యాయాలు కలిసి వినతిపత్రం అందజేశామని చెప్పా రు. పార్లమెంట్‌ ఎన్నికలలోపు సర్పంచ్‌లకు అందాల్సిన పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేశా రు. లేకపోతే ఒక్కో లోక్‌సభ సెగ్మెంట్‌ పరిధిలో వందకు పైగా నామినేషన్లు దాఖలు చేసి ప్రజాప్రతినిధులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్య క్రమంలో సర్పంచ్‌ల సంఘం నేతలు కొలను శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డిలు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement