సాక్షి, హైదరాబాద్: నగర ట్రాఫిక్ విభాగంలోనూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగానికి అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా డ్రోన్లు సమీకరించుకుని వాటి సహాయంతో గస్తీ నిర్వహించాలని ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ నిర్ణయించారు. నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అనుమతితో ఇప్పటికే చేపట్టిన ప్రయోగాత్మక పరిశీలన సంతృప్తికర ఫలితాలు ఇచ్చింది. దీంతో త్వరలో తొలి దఫా మూడింటిని సమీకరించుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన స్టార్టప్ సంస్థ నుంచి వీటిని ఖరీదు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఆ ప్రాంతాల్లో.. తిప్పలెన్నో..
సిటీలోని రోడ్లపై ట్రాఫిక్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఉదయం–సాయంత్రం పీక్ అవర్స్‌గా పిలిచే రద్దీ వేళల్లో భారీ రద్దీ ఉంటుంది. ఈ సమయాల్లో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్స్ కూడా ఏర్పడుతుంటాయి. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇవి మరింత ఎక్కువ. ఆయా చోట్ల ఉండే అక్రమ పార్కింగ్, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు, బాటిల్ నెక్స్ కారణంగా ఈ ఇబ్బందులు మరింత పెరుగుతుంటాయి. వీటిని నిరోధించడానికి ప్రస్తుతం స్థానిక ట్రాఫిక్ పోలీసులు ద్విచక్ర వాహనాలతో పాటు తేలికపాటి వాహనాల పైనా గస్తీ నిర్వహిస్తుంటారు. ట్రాఫిక్‌కు అడ్డంకులు సృష్టించే వాటిని గుర్తించి సరి చేస్తుంటారు. దీనికోసం పెద్ద సంఖ్యలో ట్రాఫిక్ పోలీసులు, హోంగార్డులను వినియోగించాల్సి వస్తోంది.
ప్రముఖుల పర్యటనల నేపథ్యంలోనూ..
నగరంలో అనునిత్యం ప్రముఖుల పర్యటనలు సాగుతుంటాయి. రాష్ట్రంలో ఉన్న వీవీఐపీలతో పాటు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి ఏటా వందల సంఖ్యలో ముఖ్యులు వస్తుంటారు. వీరి రాకపోకల నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ట్రాఫిక్ పోలీసులు ఆయా మార్గాల్లో మళ్లింపులు విధించడంతో పాటు గస్తీ నిర్వహించడం పరిపాటి. కీలక సభలు, సమావేశాలతో పాటు గణేష్, బోనాలు వంటి పండగలు, ఉత్సవాల సమయంలోనూ రహదారులపై ట్రాఫిక్ పోలీసుల కదలికలు ఎక్కువగా ఉంటేనే సామాన్యులకు ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ప్రస్తుతం ఈ విధులను స్థానిక ట్రాఫిక్ ఠాణాలకు చెందిన సిబ్బంది రోడ్లపై సంచరిస్తూ నిర్వర్తిస్తున్నారు.
టీసీసీసీతో అనుసంధాని వినియోగం...
ఈ డ్రోన్లను బషీర్‌బాగ్‌లోని ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో (టీసీసీసీ) అనుసంధానించనున్నారు. డ్రోన్ కెమెరాల్లో కనిపించే దృశ్యాలను ఇక్కడి సిబ్బంది అనునిత్యం పరిశీలిస్తూ ఉంటారు. వీళ్లు గమనించిన అంశాల ఆధారంగా రహదారిపై అవసరమైన ప్రాంతానికి క్షేత్రస్థాయి సిబ్బందిని పంపిస్తారు. డ్రోన్ కెమెరా అందించిన విజువల్స్ ఆధారంగా ఇతర విభాగాలను అప్రమత్తం చేయనున్నారు. ప్రస్తుతం సిటీలో ఉన్న సీసీ కెమెరాలు సైతం ఈ సెంటర్‌తోనే అనుసంధానించి ఉన్నాయి. ఇప్పుడు డ్రోన్ కెమెరాలను అనుసంధానిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. గరిష్టంగా రెండు నెలల్లో నగర ట్రాఫిక్ విభాగంలో మూడు డ్రోన్లు సేవలు అందించనున్నాయి.
తిరుమలగిరి ప్రాంతంలో ప్రయోగాత్మకంగా..
ఇలా రహదారులపై పెట్రోలింగ్ చేయడంలో ట్రాఫిక్ పోలీసులకు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఒక్కో బృందం ఒక సమయంలో కేవలం ఓ రహదారిపై మాత్రమే పని చేయగలుగుతోంది. దాన్ని క్లియర్ చేసిన పోలీసులు మరో చోటుకు వెళ్లేసరికి ఇక్కడ మళ్లీ అడ్డంకులు వచ్చిపడుతున్నాయి. దీనికి పరిష్కారంగా డ్రోన్ల సాయంతో గగనతల గస్తీ నిర్వహణకు ట్రాఫిక్ పోలీసులు డ్రోన్లు ఖరీదు చేస్తున్నారు.
రహదారులపై రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, అనుకోకుండా తలెత్తే నిరసనల సందర్భంలోనూ వీటిని వినియోగించనున్నారు. రాష్ట్రానికి చెందిన స్టార్టప్స్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉన్న ట్రాఫిక్ పోలీసులు ఈ డ్రోన్లను ప్రభుత్వ గుర్తింపు పొందిన దాని నుంచి ఖరీదు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే తిరుమలగిరి ప్రాంతంలో ప్రయోగాత్మకంగా రెండుసార్లు డ్రోన్లను వాడి చూశారు. ఇవి సత్ఫలితాలను ఇవ్వడంతో ముందుకు వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు.
(చదవండి: అంతా ఆ తాను ముక్కలే!)
Comments
Please login to add a commentAdd a comment