‘ఏఐ’పంట! | Artificial Intelligence in Agriculture | Sakshi
Sakshi News home page

‘ఏఐ’పంట!

Published Sat, Aug 12 2023 1:23 AM | Last Updated on Sat, Aug 12 2023 1:23 AM

Artificial Intelligence in Agriculture - Sakshi

కంచర్ల యాదగిరిరెడ్డి:నాగలి పోయి ట్రాక్టర్‌ వచ్చినప్పుడు.. యంత్రాలు సాగు చేస్తాయా? అన్నవాళ్లున్నారు.ట్రాక్టర్లకు హార్వెస్టర్లు, స్ప్రేయర్లు, ఇప్పుడు డ్రోన్లూ తోడవడంతో బాగున్నాయే అనుకున్నారు. ఆధునిక యంత్ర పరికరాల రాకతో వ్యవసాయం కొంత పుంజుకున్నా.. తర్వాతి తరాలు మాత్రం వ్యవసాయం అంటే అమ్మో అంటున్నారు.ఇలాంటి సమయంలోనే ‘చాట్‌ జీపీటీ’, దాని ఆధారితంగా మరిన్ని కృత్రిమ మేధ సాంకేతికతలు తెరపైకి వచ్చాయి. వ్యవసాయ రంగంపైనా ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే కొన్ని ఏఐ ఆధారిత పరికరాలు అందుబాటులోకి వచ్చాయి కూడా. మరి మొత్తంగా దీనివల్ల రైతులకు ఏం మేలు జరుగుతుంది? వ్యవసాయానికి ఏం ఒనగూరుతుంది? అంతిమంగా వచ్చేది లాభమా, నష్టమా? అన్న చర్చ సాగుతోంది.  

దేశ స్థూల జాతీయోత్పత్తిలో ఇప్పటికీ వ్యవసా­యం వాటా దాదాపు 50 శాతంపైనే. కోట్లమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న రంగం ఇదే. అయితే రుతుపవనాలు, మార్కెట్‌ పరిస్థితులు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు లభించకపోవడం వంటి అనేక కారణాలతో వ్యవసాయం ఇప్పటికీ ఆశల జూదంగానే మిగిలిపోయింది. ప్ర­భు­త్వం రకరకాల పథకాలు, లాభాలు చేకూరుస్తున్నప్పటికీ పరిస్థితిలో మార్పు తక్కువే. ఈ కారణంగానే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు డ్రోన్లు, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి ఆధునిక టెక్నాలజీల వాడకం మొదలైంది.

అయితే గత ఏడాది విడుదలైన ‘చాట్‌ జీపీటీ’ఈ ప్రస్థానాన్ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్లిందని చెప్పాలి. మైక్రోసాఫ్ట్‌కు చెందిన అజ్యూర్‌ ఓపెన్‌ ఏఐ సర్విస్‌ ద్వారా చాట్‌ జీపీటీ ఆధారంగా తయారైన‘జుగల్‌బందీ’చాట్‌బోట్‌ వీటిలో ఒకటి. రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వేర్వేరు సంక్షేమ, సహాయ పథకాల వివరాలను అందిస్తుందీ సాఫ్ట్‌వేర్‌. వాట్సాప్‌ ద్వారా కూడా అందుకోగల ఈ చాట్‌ బోట్‌ ఇంగ్లిషులో ఉన్న ప్రభుత్వ సమాచారాన్ని పది భాషల్లోకి అనువదించి మరీ అందిస్తూండటం విశేషం. 

చాట్‌ జీపీటీ వంటి కృత్రిమ మేధ సాఫ్ట్‌వేర్లకు వ్యవసాయంతో ఏం పని? అని చాలామంది అనుకోవచ్చు. కానీ, దీని చేరికతో సాగు అన్ని రకాలుగా మెరుగవుతుందన్నది నిపుణుల అంచనా. సమాచారం ఎంత ఎక్కువగా ఉన్నా సెకన్లలో దానిని విశ్లేషించి రైతులకు ఉపయోగపడే కొత్త సమాచారాన్ని అందించగలగడం దీనితో సాధ్యం. నీరు, ఎరువులు, కీటకనాశనుల వంటి వనరులను అవసరమైనంత మాత్రమే వాడేలా చేయడం, పంట దిగుబడులు పెంచడంకోసం తోడ్పడగలదు. ఎప్పటికప్పుడు మారిపోయే వాతావరణాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని తగిన సలహా, సూచనలు ఇవ్వగలదు. 

ప్రిడిక్టివ్‌ అనాలసిస్‌: వందేళ్ల వాతావరణ సమాచారం, మట్టి కూర్పు, పంటకు ఆశించే చీడపీడలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని.. వేసిన పంట ఎంత బాగా పండేది కచి్చతంగా చెప్పగలదు. దీన్నే ప్రిడిక్టివ్‌ అనాలసిస్‌ అంటారు. ఒకవేళ నష్టం జరిగే అవకాశముంటే దాన్ని వీలైనంత తగ్గించుకునే సూచనలూ అందుతాయి. 

గరిష్టంగా దిగుబడులు:  నేల, వాతావరణ పరిస్థితులకు తగ్గట్టు ఏ పంట వేస్తే గరిష్ట దిగుబడులు రాబట్టుకోవచ్చో గుర్తించగలదు. పంటల యాజమాన్య పద్ధతులను కూడా నిర్దిష్ట పరిస్థితులు, అవసరాలకు తగ్గట్టుగా సూచించగలదు. వేర్వేరు మార్గాల ద్వారా సమాచారాన్ని సేకరించి విశ్లేషించడం, సొంతంగా పంటల తాలూ­కు సిమ్యులేషన్లు తయారు చేసుకుని అత్యున్నత సాగు పద్ధతులు, పంటలను అంచనా వేయడం సాధ్యమవుతుంది. దీనిద్వారా పంట దిగుబడులు, వ్యవసాయ రంగ ఉత్పాదకత గణనీయంగా పెరిగే అవకాశం ఏర్పడుతుంది. 

ప్రిసిషన్‌ అగ్రికల్చర్‌: జనరేటివ్‌ ఏఐ ద్వారా వ్యవసాయంలో వ్యర్థాలను గణనీయంగా తగ్గించగల ప్రిసిషన్‌ వ్యవసాయం సాధ్యమవుతుంది. ఉదాహరణకు పంట పొలం మొత్తం తిరిగే డ్రోన్లు కలుపును గుర్తిస్తే.. అతితక్కువ కలుపునాశనులతో వాటిని తొలగించే ప్లాన్‌ను ఏఐ అందివ్వగలదన్నమాట. అలాగే ఏయే మొక్కలకు నీరు అవసరం? వేటికి ఎండ కావాలన్న సూక్ష్మ వివరాలను కూడా ప్రిసిషన్‌ అగ్రికల్చర్‌ ద్వారా గుర్తించి అందించవచ్చు. ఉపగ్రహ ఛాయాచిత్రాలు, వాతావరణ సమాచారం, మట్టి కూర్పు వంటివన్నీ పరిగణించడం ద్వారా చేసే ప్రిసిషన్‌ అగ్రికల్చర్‌ ద్వారా ఖర్చులు తగ్గుతాయి. దిగుబడులు పెరుగుతాయి.  

కొత్త వంగడాల సృష్టి: వాతావరణ మార్పుల నేపథ్యంలో కరువు కాటకాలు, వరదల వంటివి పెరిగాయి. ఈ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని మనగలిగిన కొత్త వంగడాల అవసరం పెరిగింది. సంప్రదాయ పద్ధతుల్లో జరిగే పరిశోధనల ద్వారా ఈ వంగడాల సృష్టికి చాలా కాలం పడుతుంది. కానీ జనరేటివ్‌ ఏఐను ఉపయోగిస్తే.. అధిక దిగుబడులిచ్చే, వాతావరణ మార్పులను తట్టుకోగల వంగడాలను వేగంగా సృష్టించడం సాధ్యమని నిపు ణులు చెప్తున్నారు. జన్యు సమాచారాన్ని విశ్లేషించి ఏ రకమైన జన్యువులను తొలగిస్తే, చేరిస్తే లాభదాయకమో ఈ కత్రిమ మేధ సాఫ్ట్‌వేర్లు వేగంగా గుర్తించగలవు.

చాట్‌బోట్‌లు.. కాల్‌సెంటర్‌లు 
భారత ప్రభుత్వం కూడా వ్యవసాయంలో జనరేటివ్‌ ఏఐ సామర్థ్యాన్ని గుర్తించింది. కేంద్ర ఐటీ, ఎల్రక్టానిక్స్‌ శాఖ వాట్సాప్‌ ఆధారిత చాట్‌బోట్‌ ఒకదాన్ని సృష్టించే ప్రయత్నాల్లో ఉంది. బెంగళూరుకు చెందిన ఒక కంపెనీ సిద్ధం చేసిన ‘కిసాన్‌ ఏఐ (కిసాన్‌ జీపీటీ)’ఇప్పటికే పది భారతీయ భాషల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు సంబంధిత కార్యక్రమాలు, పథకాల వివరాలను అందిస్తోంది.

దీంతోపాటే దిగుబడులు, ఆదాయాన్ని పెంచుకునేందుకు అవసరమైన సలహా, సూచనలు ఇస్తోంది. ప్రతినెలా కనీసం 40 వేల మంది రైతులు కిసాన్‌ ఏఐ ద్వారా లబ్ధి పొందుతున్నట్టు దాన్ని అభివృద్ధి చేసిన ప్రతీక్‌ దేశాయ్‌ తెలిపారు.వాధ్వానీ ఏఐ అనే స్వతంత్ర, లాభాపేక్ష లేని సంస్థ కూడా జనరేటివ్‌ ఏఐ సాయంతో రైతులకు వచ్చే సందేహాలను తీర్చేందుకు కిసాన్‌ కాల్‌సెంటర్‌ ఒకదాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉంది.

వ్యవసాయ రంగ నిపుణుల అనుభవాన్ని జనరేటివ్‌ ఏఐతో అను­సంధానించేందుకు తాము ప్రయతి్నస్తున్నట్లు వాధ్వానీ ఏఐ తెలిపింది. డిజిటల్‌ గ్రీన్‌ పేరున్న అంతర్జాతీయ సంస్థ గూయీ ఏఐతో జట్టుకట్టి వాతావరణ మార్పులను తట్టుకునేలా రైతులను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూండగా ఒడిశా వ్యవసాయ శాఖ ‘అమాకృష్‌ ఏఐ’ద్వారా పంటల నిర్వహణలో రైతులకు సమాచారం అందిస్తోంది. ప్రభుత్వ పథకాల వివరాలు, నలభైకు పైగా వాణిజ్య, సహకార బ్యాంకులు రైతులకు అందించే రుణ పథకాల వివరాలను ఈ చాట్‌బోట్‌ ద్వారా అందిస్తోంది. 

తెలంగాణలో ‘మిర్చి, పసుపు’ పరికరాలు 
మిర్చి, పసుపు పంటల్లో నాణ్యతను తేల్చేందుకు కృత్రిమ మేధ ఆధారిత పరికరాలను ఇప్పటికే వినియోగిస్తున్నారు. ఈ పంటలు ఏవైనా తెగుళ్లకు గురయ్యాయా? వాటిలోని రసాయనాల శాతం, రంగు, తేమ శాతం వంటి వాటిని నిమిషాల్లో తేల్చేస్తున్నారు. ఈ అంశాల ఆధారంగా మిర్చి, పసుపు పంటలకు గ్రేడింగ్‌ ఇస్తున్నారు. రైతులు తమ ఉత్పత్తులను త్వరగా మార్కెటింగ్‌ చేసుకోవడానికి, తగిన ధర పొందడానికి ఇది వీలు కల్పిస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement