సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/ జగిత్యాల టౌన్: ‘నేను నిరాధార ఆరోపణలు చేస్తున్నానని, నా ముక్కును నేలకు రాయాలని కవిత అంటోంది. నేను ముక్కు కాదు కదా.. కాలు కూడా నేలకు రాయను, కవిత తండ్రి కేసీఆర్ ముక్కునే గజ్వేల్‌లో నేలకు రాయిస్తాను’అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లపై నిర్వహించిన ధర్నాలో అర్వింద్ మాట్లాడుతూ, తెలంగాణకు పట్టిన దరిద్రం కేసీఆర్ అని వ్యాఖ్యానించారు. పేదలకు నాలుగు లక్షల డబుల్ బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తానని భారీగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం, అందుకు విరుద్ధంగా వ్యవహరించిందని విమర్శించారు.
డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం వివిధ బడ్జెట్‌లలో కలిపి రూ.30 వేల కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం చూపించినా ఇళ్లు మాత్రం కట్టించలేదని, ఈ విషయాన్ని రాష్ట్ర ఆడిట్ విభాగమే తేల్చిందన్నారు. ఇక్కడ నొక్కేసిన డబ్బులతోనే కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీలో లిక్కర్ వ్యాపారం చేసిందని, ఐరన్‌లెగ్ కవితను నమ్ముకున్న ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జైలుపాలయ్యారని అన్నారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర నిధులకు రాష్ట్ర ప్రభుత్వ వాటా జోడించి పేదలకోసం 8 లక్షల ఇళ్లు కట్టించగా, తెలంగాణలో మాత్రం ఈ ప్రభుత్వం కట్టించిన ఇళ్లు గుండుసున్నా అని అర్వింద్ వ్యాఖ్యానించారు.
జీవన్‌రెడ్డి నాకు తండ్రిలాంటి వారు
ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి తనకు తండ్రిలాంటి వారని, కానీ, ఆయన సేవలు అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ పని ఖతమైందని అర్వింద్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రం తహసీల్ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో అరి్వంద్ మాట్లాడుతూ, పేద మహిళలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించి ఇస్తానన్న హామీని కేసీఆర్ తుంగలో తొక్కారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment