సాక్షి, ఖమ్మం: దేశం మార్పు కోరుతోందని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని తరిమికొట్టాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను గవర్నర్లు ఇబ్బందిపెడుతున్నారని, వారిని ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి ఆడిస్తున్నారని ఆరోపించారు. తాను ఇతర సీఎంలు, నేతలు కలసి రాజకీయాలు మాట్లాడుకోలేదని.. దేశ అభివృద్ధి కోసమే చర్చించామని తెలిపారు. ఖమ్మం సభలో కేజ్రీవాల్ చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే..
‘‘తమిళనాడు, తెలంగాణ, ఢిల్లీ, పంజాబ్ గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారు.. వారందరికీ ఢిల్లీ నుంచి ఫోన్ వస్తుంది. దానికి అనుగుణంగా గవర్నర్లు రాజకీయాలు చేస్తున్నారు. ఎవరి మీద సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేయించాలి, ఏ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని 24 గంటలూ ఆలోచిస్తుంటే దేశం ఎప్పుడు బాగుపడుతుంది. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతుంటే కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి చింత లేదు. ఎవరి ఎమ్మెల్యేలను కొనాలి, ఎవరి ప్రభుత్వా న్ని పడగొట్టాలనే ఆలోచనే తప్ప ఏమీ పట్టడం లేదు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా మన దేశం ఇంకా పేద దేశంగానే ఉంది. మనకంటే వెనుక స్వాతంత్య్రం వచ్చిన సింగపూర్ జపాన్ వేగంగా అభివృద్ధి చెందాయి.
ఒకరి నుంచి మరొకరు నేర్చుకోవాలి
ఈ రోజు సీఎంలు అందరం కలిసి రాజకీయాలు చర్చించలేదు. దేశాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించాం. పరస్పర ఘర్షణ వైఖరి కాకుండా ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటే దేశం చాలా అభివృద్ధి చెందుతుంది. ఢిల్లీలో మేం చేపట్టిన మొహల్లా క్లినిక్‌లను చూసేందుకు సీఎం కేసీఆర్ గల్లీల్లో తిరుగుతూ.. మా డాక్టర్లు, నర్సు లతో మాట్లాడారు. తెలంగాణలో బస్తీ దవాఖా నాలను ఏర్పాటు చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఢిల్లీ ప్రభుత్వ స్కూళ్లలో అభివృద్ధిని చూసి.. ఆ రాష్ట్రంలోనూ చేపట్టి నన్ను ఆహ్వానించారు. ఢిల్లీలో ప్రైవేటు స్కూళ్లు వదిలి ప్రభుత్వ స్కూళ్లలో చేరుతున్నారు. 99.7 శాతం ఫలితాలు వచ్చాయి. కేరళలో స్కూళ్లు, హాస్పిటళ్లు బాగున్నాయి. దేశవ్యాప్తంగా అలా ఎందుకు లేవు?
కేసీఆర్ పెద్దన్నలాంటి వారు
తెలంగాణలో ప్రవేశపెట్టిన కంటి వెలుగు గొప్ప కార్యక్రమం. నాలుగు కోట్ల మంది పేద, ధనిక వర్గాలకు కంటి పరీక్షలు చేసి మందులు, ఆపరేషన్లు, కళ్ల జోళ్లు ఉచితంగా అందించటం అభినందనీయం. తెలంగాణ నుంచి చాలా నేర్చుకున్నా.. కంటి వెలుగు కార్యక్రమాన్ని ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లోనూ అమలు చేస్తాం. సమీకృత కలెక్టరేట్ల కాన్సెప్ట్ అద్భుతం. కేసీఆర్ ఈ విషయంలో పెద్దన్నలాంటి వారు. తెలంగాణలో చేపట్టిన మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు..’’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment