యువతలో మార్పు తీసుకురావాలనేదే ఉద్దేశం
ఆచరణలో ఆటో డ్రైవర్ వినూత్న ఆలోచన
పలువురిని ఆలోచింపజేస్తున్న కొటేషన్లు
సాక్షి, హైదరాబాద్: ఆయనో ఆటో డ్రైవర్.. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ ఉరుకులు పరుగుల జీవితం.. ఎంతో కష్టపడితే కానీ ఐదు వేళ్లూ నోట్లోకి వెళ్లవు. కానీ ఆయన ఆలోచనలు మాత్రం ప్రతిక్షణం సమాజం గురించే.. సమాజంలో ఉన్న సమస్యలు.. ముఖ్యంగా యువతలో పెరుగుతున్న విపరీత ధోరణులపై అనుక్షణం ఆలోచిస్తూ ఉంటాడు.
అందుకే యువతలో, సమాజంలో మార్పు తీసుకురావాలని సంకల్పించాడు. అయితే ఓ ఆటోడ్రైవర్.. తాను ఏదో ఒకటి చేయాలని సంకల్పించాడు.
తన పరిధిలో ఏం చేయగలనో ఆలోచించాడు. కూడళ్లు, విద్యుత్ స్తంభాలు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో మనం మారాలి.. మార్పు రావాలి.. అంటూ కొటేషన్స్ రాయడం ప్రారంభించారు. ఆయన పేరు దాడే శ్రీనివాస్.. అంబర్‌పేటకు చెందిన శ్రీనివాస్.. రెండున్నరేళ్లకు పైగా ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
రోజుకో కొటేషన్..
వివేకానంద సూక్తులు, వాక్యాలు తనకు ఎంతో స్ఫూర్తినిస్తాయని చెబుతున్నాడు 45 ఏళ్ల శ్రీనివాస్. ఈయనకు దేశ భక్తి కూడా ఎక్కువే.
తన ఆటోలో ప్రయాణించే వారు తమ సమస్యలు చెప్పుకొంటుంటే ఎంతో బాధ అనిపించేదని, వీటన్నింటికీ కారణం సమాజంలో పెరుగుతున్న విపరీత ధోరణులే కారణమని పేర్కొంటున్నాడు. ఇక, తల్లిదండ్రులను ఆస్తుల కోసం హింసించడం.. పెద్ద వారిపై గౌరవం లేకుండా ఉండటం వంటివి ఎన్నో ఉదంతాలు చూసి ఆవేదనకు గురయ్యేవాడినని గుర్తు చేసుకున్నాడు. ఇక, యువత చెడు అలవాట్లకు బానిసై విలువలు లేని జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటి వారిలో చిన్న మార్పు అయినా వస్తుందనే నమ్మకంతో ఇలా కొటేషన్లు రాస్తున్నానని చెప్పాడు. అలాగే తన ఆటోపై కూడా ప్రతి రోజూ కొత్త కొటేషన్లు రాస్తుంటానని వివరించాడు.
చిన్నతనంలోనే నగరానికి..
షాద్‌నగర్ కుర్వగూడకు చెందిన శ్రీనివాస్ చిన్నతనంలోనే నగరానికి వలస వచ్చాడు. ఇంటరీ్మడియెట్‌లోనే చదువు ఆపేసిన శ్రీనివాస్.. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారిని కూడా చిన్నప్పటి నుంచే మంచి మార్గంలో నిలపాలనే ఉద్దేశంతో ఇంట్లో చిన్న బోర్డు ఏర్పాటు చేసి, దానిపై మంచి సూక్తులు రాసేవాడట. దీంతో వారు కూడా పెద్ద చదువులు చదువుకొని.. మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ధర్మబద్ధంగా, సహనంతో ప్రతి ఒక్కరూ జీవిస్తే సమాజంలో ఉన్న అనేక సమస్యలు రూపుమాపుతాయనేది తన నమ్మకమని చెబుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment