
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహనే అసలైన మందు. ఇందుకోసం సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు. ఐటీ కంపెనీలు, ఉద్యోగులు ఎక్కువగా ఉండే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ విధానం ప్రజలకు ఎంతో ఉపయుక్తకంగా మారింది. రోడ్డు ప్రమాదాల నివారణ, నిబంధనలపై యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాలో పోస్ట్‌లు పెడుతూ.. అవగాహన కల్పిస్తున్నారు. రహదారి భద్రతపై హిట్ సినిమాల్లోని పాత్రలతో పోస్ట్‌లు, షార్ట్ వీడియోలు చిత్రీకరించి ప్రచారం చేస్తున్నారు.
లక్షల్లో ఫాలోవర్స్..
సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు సోషల్ మీడియాలకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. 1.2 లక్షలకు పైగా సబ్‌స్రైబర్లు ఉన్న యూట్యూబ్ ఛానల్‌కు ఇటీవలే యూట్యూబ్ నిర్వాహకుల నుంచి సిల్వర్ ప్లే బటన్ అవార్డ్ కూడా దక్కింది. రహదారి భద్రత, వాహనదారుల నిబంధనలపై ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు అందించే సలహాలు, సూచనలతో కూడిన వీడియోలను యూట్యూబ్‌లో పెడుతున్నారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన రహదారి ప్రమాదాలను వీడియో ప్రదర్శిస్తూ.. అందుకు దారి తీసిన కారణాలు, వాహనదారుల తప్పిదాలను వివరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రమాదాల బారినపడి కోలుకున్న బాధితుల అనుభవాలు, గాయపడిన వ్యక్తులకు వైద్య సేవలు అందించిన వైద్యులు పంచుకున్న అంశాలను యూట్యూబ్ ద్వారా సబ్‌స్క్రైబర్లకు చేరవేస్తున్నారు.
15 రోజులకొకసారి సమీక్ష..
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర 15 రోజులకు ఒకసారి ట్రాఫిక్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. సైబరాబాద్‌లో కొత్తగా నిర్మించిన రహదారులు, ఫ్లైఓవర్లు, లింక్ రోడ్లను ప్రజలు వినియోగించుకోవాలని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ, ట్రాఫిక్ రద్దీని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఏ సమయంలో ఎక్కడ ఎంత ట్రాఫిక్ రద్దీ ఉందో ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాలలో అప్‌డేట్ చేస్తున్నారు.
వార్తా పత్రికలలో వచ్చిన కథనాలను, సృజనాత్మక చిత్రాలను రూపొందించి ప్రతి రోజు 4–5 వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. అఖండ, పుష్ప, కేజీఎఫ్, ఆర్‌ఆర్‌ఆర్ వంటి కొత్త సినిమాలలోని డైలాగ్‌ను తీసుకొని వాటికి హెల్మెట్, డ్రంకన్ డ్రైవింగ్, అతివేగం, సీట్ బెల్ట్ ధరించడం తదితర అంశాలను సినిమా పాత్రల ద్వారా పోస్ట్‌లు రూపొందించి సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తున్నారు.
అవగాహనతోనే ప్రమాదాల నివారణ
రోడ్డు ప్రమాదాల నివారణకు అసలైన మందు అవగాహనే. ప్రమాదాలను నివారించేందుకు సిబ్బంది, నిబంధనల అమలుతో పాటు అవగాహన అత్యంత ముఖ్యం. ఇందుకోసం భౌతికంగా, ఆన్‌లైన్ వేదికగా కూడా సెషన్స్ నిర్వహిస్తున్నాం. మనసుకు హత్తుకునేలా, సులువుగా అర్థమయ్యేలా స్కిట్స్ రూపంలో రోడ్డు భద్రతా నిబంధనలను వివరిస్తున్నాం.
– పీ శ్రీనివాస్ రెడ్డి, అదనపు డీసీపీ, సైబరాబాద్ ట్రాఫిక్
(చదవండి: అసలే అక్రమం... ఆపై అనైతికం!)
Comments
Please login to add a commentAdd a comment