అమ్మా అమ్మా నీ పసిదాన్నమ్మా.. నీవే లేక వసివాడనమ్మా మాటే లేకుండా నువ్వే మాయం కన్నీరవుతోంది ఎదలో గాయం అయ్యో వెళ్లిపోయావే నన్నొదిలేసి ఎటుపోయావే... అంటూ తల్లడిల్లిపోతోంది శామీర్‌పేట డీర్–పార్క్‌లోని పసి దుప్పి.
శామీర్‌పేట్: ముద్దులొలికే ఈ చిన్నారి జంకకు సీత కష్టాలు వచ్చాయి. తల్లి తన వద్దకు ఎప్పుడు వస్తుందోనని వేయి కళ్లతో.. కోటి ఆశలతో వేచి చూస్తోంది. చిన్నచిన్నగా గెంతుతూ ఎంతో అందంగా ఉన్న ఆ దుప్పి తల్లి కనిపించక విలవిలలాడిపోతోంది. శామీర్‌పేట డీర్ పార్కులో నెలన్నర క్రితం పార్కు ఫెన్సింగ్‌లో తల ఇరుక్కుని ఉన్న సుమారు రెండు రోజుల వయస్సు ఉన్న జింకపిల్లను సిబ్బంది గమనించారు. దానికి చికిత్స చేసి అప్పటి నుంచి ఆవు పాలు తాగిపిస్తూ పెంచుతున్నారు. మరి అప్పటి నుంచి తల్లి జింకను ఎందుకు పట్టుకోలేకపోయారు.? ఎక్కడ ఉంది అనే దానిపై విచారణ చేపట్టారా? తల్లీబిడ్డను ఇప్పటి వరకు ఎందుకు కలుపలేకపోయారు? అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై అటవీశాఖ అధికారులు ఏమి సమాధానం చెబుతారో వేచి చూద్దాం.
తరలించిన జింకలలో ఉందా.?
ఫిబ్రవరి చివరి వారంలో శామీర్‌పేట డీర్‌పార్కు నుంచి కాగజ్‌నగర్‌కు 27 జింకలను తరలించామని అధికారులు తెలిపారు. అదే సమయంలో ఈ దుప్పి జన్మించింది. ఈ దుప్పి తల్లి కాగజ్‌నగర్‌కు తరలించిన జింకలలో ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ఫారెస్ట్ సెక్షన్ అధికారిని వివరణ కోరగా పొంతనలేని సమాధానాలు చెప్పడం కొసమెరుపు. దీనిపైన సమగ్ర దర్యాప్తు జరిపి దుప్పిని తల్లి వద్దకు చేర్చాలని జంతుప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment