శనివారం అభినందన సభలో రాజ్యసభ సభ్యుడు డా.లక్ష్మణ్‌తో బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్. చిత్రంలో ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్
గన్‌ఫౌండ్రి(హైదరాబాద్): బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి బీజేపీతోనే సాధ్యమని రాజ్యసభ సభ్యుడు, ఆ పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. సాధారణ కార్యకర్త సైతం అత్యున్నత పదవిని అందుకోవడం బీజేపీలోనే జరుగుతుందని చెప్పారు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై శనివారం హైదరాబాద్‌కు వచ్చిన లక్ష్మణ్‌కు బీజేపీ రాష్ట్ర శాఖ ఘనస్వాగతం పలికింది. అనంతరం నాంపల్లిలో ఏర్పాటు చేసిన అభినందన సభలో లక్ష్మణ్ మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించిందనేందుకు తన ఎన్నికే నిదర్శనమన్నారు. యూపీ అభివృద్ధిపై గతంలో మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారని, తనతో పాటు వస్తే ప్రగతిని చూపిస్తానని చెప్పారు.
యూపీలోని బుల్డోజర్ తరహా పాలన తెలంగాణలోనూ వస్తుందన్నారు. బీజేపీకి కులం, మత భేదాల్లేవని.. పేదరికమే ప్రాథమికం గా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లో సగం జనాభా ముస్లింలేనని, అక్కడ వారికి సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయన్నారు. బీజేపీ రాష్ట్ర శాఖలో పాత, కొత్త కలయికల వైరం ఉన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. సీఎం కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ఈటల రాజేందర్, స్వామిగౌడ్, వివేక్‌వెంకటస్వామి వంటి వారు బీజేపీలో చేరారని వివరించారు. అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శాసనసభ్యులు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్‌రావు, మాజీ శాసన సభ్యులు నల్లు ఇంద్రసేనారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, కూన శ్రీశైలంగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
ఘన స్వాగతం ...
లక్ష్మణ్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, కూన శ్రీశైలంగౌడ్, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, బీజేపీ రంగారెడ్డి జిల్లా, సెంట్రల్ హైదరాబాద్ అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, డాక్టర్ ఎన్. గౌతమ్ స్వాగతం పలికారు. శంషాబాద్, ఆరాంఘర్ చౌరస్తా, మెహదీపట్నం మీదుగా భారీ ర్యాలీలు నిర్వహించారు. ఓపెన్‌టాప్ జీప్‌లో ప్రయాణించిన లక్ష్మణ్ పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రేమ్‌రాజ్, ఎస్సీసెల్ ప్రొటోకాల్ కో–కన్వీనర్ కె. ప్రశాంత్, హైదరాబాద్ నాయకులు సూర్యప్రకాశ్, సందీప్‌యాదవ్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment