‘విమోచన’ అనడానికి మీకున్న అభ్యంతరాలేంటి? | MP Dr K Laxman Of Telangana Vimochana Dinotsavam | Sakshi
Sakshi News home page

‘విమోచన’ అనడానికి మీకున్న అభ్యంతరాలేంటి?

Published Mon, Sep 16 2024 7:34 PM | Last Updated on Mon, Sep 16 2024 8:19 PM

MP Dr K Laxman Of Telangana Vimochana Dinotsavam

17 సెప్టెంబర్‌- తెలంగాణ విమోచన దినం

సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవం అనేందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ జంకుతున్నాయి. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జాతీయ సమైక్యతా దినం అంటే.. ఇప్పటి రేవంత్‌ సర్కారేమో ‘ప్రజా పాలన దినోత్సవం’ అంటోంది. ‘విమోచన’ అనడానికి మీకున్న అభ్యంతరాలేంటి? ఏం అడ్డం వస్తుంది. పాతవస్తీ వరకే పరిమితమైన మజ్లిస్‌ పార్టీకి చెందిన ఓవైసీలకు అంతలా ఎందుకు భయపడుతున్నారు..? వారిని ప్రసన్నం చేసుకున్వేఉకు చరిత్రనే వక్రీకరిస్తారా..? నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన అమరవీరుల త్యాగాలు ఇప్పటి తరానికి, భవిష్యత్‌ తరానికి తెలపద్దా..?

రైతులు, కూలీలు, సబ్బండ వర్ణాలు ఏకమై కత్లుళ్లు, గొడ్డళ్లు, వడిసెళ్లు, బరిసెళ్లు, బర్మారు తుపాకులు, రోకలిబండలతో ప్రాణానికి తెగించిన పోరాట చరిత్రను ఇప్పటి తరానికి తెలియకుండా ఎందుకు తొక్కుపెడుతున్నారు.. నాడు నిజాం హైదరాబా్‌ సంస్థానాన్ని స్వతంత్ర ఇస్లాం రాజ్యంగా మార్చాలని ప్రయత్నించలేదా..? కుదరని పక్షంలో పాకిస్తాన్‌ తోనైనా కలవాలని భావించలేదా..? కరుడుకట్టిన మతోన్మాది ఖాసి రజ్వీ రజాకార్లకు ఆయుధాలిచ్చి హిందువులపైకి ఉసిగొల్పిన చరిత్రను మర్చిపోయారా..? మనుషులను వరుసలో నిలబెట్టి తుపాకీతో కాల్చి చంపడాలు... చెట్లుకు కట్టి సామూహికంగా ఉరి తీయడాలు.. సజీవ దహనాలు.. మహిళలచే నగ్నంగా బతుకమ్మలు ఆడించడాలు.. హత్యలు, ఆత్యాచారాలు, అఘాయిత్యాలు, దోపిడీలు, దొమ్మీలు.. ఇవన్నీ ఇవన్నీ రజాకార్ల ఆకృత్యాలు కావా..?

‘ మా నిజాం రాజు తరతరాలు బూజు’ అని దాశరధి అన్నది నిజం కాదా.. ‘‘ గోల్కొండ ఖిలా కింద నీ ఘోరీ గడ్డం కొడుకో నైజాము సర్కరోడా’’ అన్న పాటలు అమద్ధమా..? ‘‘ రాజు పేరిట అరాజకమునకు-జరిగిన పూజలు చాలింక- రక్కసితనముకు పిశాచవృత్తికి- దొరికిన రక్షణ చాలింక’’ అని కాళోజీ కవితలు రాసింది నిజాంకు వ్యతిరేకంగా కాదా.. మరి ఎందుకు వాస్తవాన్ని అంగీకరించేందుకు నిరాకరిస్తున్నారు..? దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ,, షోయబుల్లా ఖాన్‌, కొమురం భీం.. వంటి వారి పోరాటాలు ఈ తరం మరచిపోవాలా..? కొందరు విద్రోహ దినం అంటున్నారు.. ప్రజలను రాచి రంపాన పెట్టిన నిజాంను ఓడించడం విద్రోహమా..? ఇది విలీనం కాదు.. విద్రోహం కాదు.. మమ్మూటికీ విమోచనే..  ఏది ఏమైనప్పటికీ.. కనీసం ఇప్పుడైనా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ సెప్టెంబర్‌ 17న విమోచన  దినోత్సవం నిర్వహించడం సంతోషమే.. ఇది బీజేపీ విజయం.. తెలంగాణ ప్రజల విజయం.

హైదరాబాద్‌ సంస్థానంలో భాగమై ఇప్పుడు కర్నాటక, మహారాష్ట్రలో విలీనమైన జిల్లాల్లో.. అక్కడి ప్రభుత్వాలు అధికారికంగా విమోచన దినోత్సవాలు నిర్వహిస్తున్నాయి. కానీ ఇక్కడ మాత్రం అధికారిక భాగ్యం లేదు. దీనికి కారణం ఓటు బ్యాంకు.. సంతుష్టీకరణ రాజకీయాలు.. ఓవైసీకి భయపడడం.. సెప్టెంబర్‌ 17న అధికారిక విమోచన వేడుకల కోసం బీజేపీ ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసింది.. 1998 నుంచే  ఇందుకోసం ఉద్యమాలు చేశాం.. ప్రజలను చైతన్య పరిచి, మరుగున పడేసిన చరిత్రను వెలుగులోకి తీసుకురావడానికి తెలంగాణ విమోచన యాత్రలు చేశాం.. అమరవీరుల చరిత్రను వెలికి తీశాం.. చారిత్రాత్మక ప్రాంతాలను సందర్భించాం.. అమరధామాలు నిర్మించాం..

అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు విస్మరించారు.. తెలంగాణ తెచ్చుకున్నాకయినా అధికారిక వేడుకలు నిర్వహించకుందామంటే.. అప్పటి సీఎం కేసీఆర్‌ నిరాకరించారు.. అదే కేసీఆర్‌ ఉద్యమ సమయంలో ‘ విమోచన దినోత్సవం’ నిర్వహించరని  అప్పటి ఉమ్మడి పాలకులను నిలదీశారు.. స్వయంగా ఆయనే సీఎం అయినా. మజ్లిస్‌కు భయపడి అధికారికంగా నిర్వహించలేదు.. అధికారిక వేడుకల కోసం తెలంగాణ విమోచన యాత్ర పేరిట నేను స్వయంగా తెలంగాణ వ్యాప్తంగా తిరిగి ఉద్యమాల్లో పాల్గొన్నా.. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించకున్నా సరే.. మేం అధికారిక వేడుకలు నిర్వహిస్తామని నరేంద్ర మోదీ గారు నిర్ణయం తీసుకున్నారు.. 2022లో తొలిసారి కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అధికారిక వేడుకలు నిర్వహించుకున్నాం.. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గారు పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. అమరవీరులను స్మరించుకున్నారు.. వారి త్యాగాలను కీర్తించారు

దేశం నడిబొడ్డన ఉన్న హైదరాబాద్‌ సంస్థానం రాజైన నిజాం.. ఈ ప్రాంతాన్ని స్వతంత్య ఇస్లామిక్‌ దేశంగా లేకుంటే.. పాకిస్తాన్‌తో కలపాలని భావించారు. దీనికి తోడు నియంతృత్వ నిజాం పాలనలో.. రజాకార్ల దారుణాలు, అరాచకాలు, ఆకృత్యాలకు ఇక్కడి ప్రజలు నలిగిపోతూ ఉండడంపై నాటి హోంమంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కలత చెందారు. మంచిమాటలో నిజాంను దారికి తెచ్చేందుకు ప్రయత్నించారు.. నిజాం ససేమిరా అనడంతో ఆపరేషన్‌ పోలో పేరిట పోలీస్‌ యాక్షన్‌కు శ్రీకారం చుట్టారు.. జె.ఎన్.చౌదరి  నేతృత్వంలో భారత్ సైనికులు ప్రత్యక్షంగా రంగంలోకి దిగడంతో.. నిజాం సైన్య​ం, రజాకార్లు తోకముడిచారు. హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో కలవడం పటేల్‌ పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే..

మేమే సాయుధ పోరాటం చేశామని కమ్యూనిస్టులు గొప్పలు చెప్పుకుంటారు.. కానీ ప్రజలు ఎవరికి వారు.. స్వచ్ఛందంగా అందుబాటులో ఉన్న పనిముట్లనే ఆయుధాలుగా చేసుకుని నిజాం, రజాకార్లపై పోరాడారు. ప్రజలు స్వచ్ఛంద పోరాటాన్ని కమ్యూనిస్టులు హైజాక్‌ చేశారు. కమ్యూనిస్టులు నిజంగానే నిజాంకు వ్యతిరేకంగా పోరాడితే.. నిజాం లొంగిపోయాక కూడా భారత బలగాలలో ఎందుకు పోరాడారు..? అంటే వారి పోరాటం​ నిజాంకు వ్యతిరేకంగా కాదు.. నిజాం నుంచి స్వాధీనం చేసుకొని రష్యాకు అనుబంధంగా ఇక్కడ స్వతంత్ర కమ్యూనిస్టు రాజ్యం స్థాపించాలనేది వారి కుట్ర. హైదరాబా్‌ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడం అనేది వారి ఉద్దేశం కానేకావు.. నిజాం లొంగిపోయాక భారత సైన్యాలతో పోరాటం చేయడం చారిత్రాత్మకం తప్పిదంగా ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు రావి నారాయణ రెడ్డి అభివర్ణించడం వాస్తవం కాదా..? ఇప్పుడు నిజాంకు వ్యతిరేకంగా పోరాడినట్లు చెప్పుకోవడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనం.

ఇప్పుడు మూడోసారి..  అదీ 75 వసంతాలు పూర్తి చేసుకన్న సందర్భంలో మరోసారి కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది... సెప్టెంబర్‌ 17న సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఈ వేడుకలు అధికారికంగా నిర్వహిస్తోంది.. 2022లో మోదీ ప్రభుత్వం ముందుకు వచ్చే సరికి.. గత్యంతరం లేని పరిస్థితుల్లో కేసీఆర్‌ అధికారిక వేడుకలకు సిద్ధమయ్యారు..  అప్పుడు కూడా విమోచన అనకుండా జాతీయ సమైక్యతా దినం అంటూ తప్పుదోవ పట్టించారు.. ఇప్పుడు రేవంత్‌ ప్రజాపాలన దినోత్సం​ అంటున్నారు.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, మజ్లిస్‌.. ఈ మూడు పార్టీలు ఒక్కటే.. బీజేపీ ఒక్కటే తెలంగాణ ప్రజల తరఫున పోరాడుతుంది.

నిజాం వ్యతిరేక పోరాటంలో కొన్ని ఘటనలు..

  • రజాకార్ల తుపాకీ తూటాలకు పరకాల పట్టణం రక్తసిక్తమైంది.  వందల మంది ఉద్యమకారులు చనిపోయారు. పరకాల ఘటన మరో జలియన్‌వాలాబాగ్‌గా చరిత్రలో నిలిచిపోయింది.

  • రజాకార్లు అరాచకాలను ఎదుర్కొనే​ందుకు బైరాస్‌ పల్లిలో గ్రామరక్షక దళాలను ఏర్పాటు చేసుకొని, దూరం నుంచే వారి రాకను పసిగట్టేందుకు బురుజులు నిరమించుకున్నారు. రజాకార్ల తోకముడిచేలా చేసిన భైరాన్‌పల్లి చరిత్రను మరచిపోయా..  భైరాన్‌ పల్లిపై కక్ష గట్టి మహిళలు, పిల్లలు అన్న తేడా లేకుండా అందరినీ కాల్చి చంపారు. మహిళలను బలాత్కరించారు. 118 మంది భైరాన్‌ పల్లి గ్రామ రక్షకదళం సభ్యులు వీరమరణం పొందారు.   ఆనాటి వీరోచిత పోరాటాలకు భైరాన్‌ పల్లి బురుజు ఇప్పటికీ సాక్ష్యంగా నిలుస్తుంది.

  • నిర్మల్‌లో రాంజీగోండుతో పాటు వెయ్యి మ​ందిని మర్రిచెట్టుకు సామూహికంగా ఉరి తీశారు. ఆ మర్రి ‘ గోండ్‌ మర్రి’. ‘‘ ఉరులమర్రి’’గా ప్రసిద్ధి చెందింది. 

  • చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లిలో రజాకార్లు 200 మంది గ్రామస్థులను హతమార్చి సమీపంలో బావిలో పడేశారు.. 100 మంది మహిళల పుస్తెలు తెంపుకొనొ ఎత్తుకెళ్లారు

  • భువనగిరి తాలూకాలో రేణిగుంట గ్రామస్థులు రజాకార్లతో జరిపిన పోరాటంలో 26 మంది అమరులయ్యారు.

  • జనగాం తాలూకా కాల్కొండలో రజాకార్లు 13 మంది గ్రామస్థులను కాల్చి చంపారు.

  • జనగాం తాలూకా కూట్‌గల్‌లో 1948 ఆగస్టు 25న 23 మంది సాయుధ రైతాంగ పోరాట సభ్యులను చంపిచ రజాకార్లు

  • వరంగల్‌, సూర్యాపేటలో శాంతియుత ర్యాలీ చేస్తున్న కార్యకర్తలపై కాల్పులు, 6 మంది దుర్మరణం,, మృతుల్లో కొడిలూరి లచ్చయ్య.

  • కప్పం కట్టాలంటూ గద్వాల తాలూకాలోని ఓ గ్రామంలో రజాకార్ల కాల్పులు, నలుగురు దుర్మరణం.

  • కరీంనగర్‌ జిల్లాలోని గారిపల్లి, మూసఖాన్‌ పేట్‌, ఇండ్లను తగులబెట్టిన రజాకార్లు.

  • ఖమ్మం జిల్లా మధిర తాలూకాలోని మీనబోలులో ఆరుగురు గ్రామసంరక్షకులను  పొట్టన పెట్టుకున్న రజాకార్లు.

       ఇవి మచ్చుకు కొన్ని ఇలాంటి ఘటనలు ఎన్నో ఎన్నెన్నో జరిగాయి.

-డా. కె.లక్ష్మణ్‌, ఎంపీ
బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు                                                                                                      
                                                                                                                   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement