సాక్షి, హైదరాబాద్: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి గెలిచే 15 స్థానాల్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఉండరని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనపై నియోజకవర్గంలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత నెలకొన్నదన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం, కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని తెలిపారు. బిహార్‌లో మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లిన విషయాన్ని సంజయ్ గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి కేసీఆర్, ఆయన కుటుంబమే పెద్ద అస్త్రాలని, వేరే అంశాలే అవసరం లేదని స్పష్టం చేశారు.
అది వారి అభిప్రాయమే..
వచ్చే ఎన్నికల్లో వాళ్లపై పోటీచేస్తాం.. వీళ్లపై పోటీ చేస్తాం’అని కొందరు చెబుతున్నారని, అది వారి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని పరోక్షంగా ఈటల రాజేందర్‌ను ప్రస్తావిస్తూ అన్నారు. పార్టీ నిర్ణయం ప్రకారం ఎవరైనా, ఎక్కడైనా పోటీ చేయాల్సి ఉంటుందని సంజయ్ తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా గెలిచేది బీజేపీనేనని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో విజయం సాధిస్తే.. దేశంలోని సగం సమస్యలకు పరిష్కారం లభించినట్లేనన్నారు.
ఎవరు అడ్డుకున్నా ఇతర పార్టీలనుంచి బీజేపీలో చేరికలు కొనసాగుతాయని, ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నాయకత్వాన్ని బలపరిచే ఎవరినైనా పార్టీలో చేర్చుకుంటామని స్పష్టం చేశారు. క్యాసినో ఆడించే చీకోటి ప్రవీణ్‌తో టీఆర్‌ఎస్ నేతలకు దగ్గరి సంబంధాలున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. ఆయనను ఉన్మాదితో పోల్చిన సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్కను ప్రస్తావిస్తూ... ‘నన్ను ఉన్మాది అంటున్నారు. అవును నేను రాజకీయ ఉన్మాదినే.. నన్ను ఉన్మాది అంటున్న వారు ఏ వాదులో చెప్పాలి’అని ఎదురు ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: అప్పుడు రోడ్డు పాల్జేసి... ఇప్పుడు సర్దుబాటా?
Comments
Please login to add a commentAdd a comment