కాజీపేట అర్బన్: మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేందుకు టీఆర్‌ఎస్ పార్టీ ఓటుకు రూ.40 వేలు ఇచ్చేందుకు సిద్ధమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. హనుమకొండలో శుక్రవారం ఆయన ఏబీవీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జుల నర్సయ్య సంస్మరణ సభకు హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అధికారాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.
తాగి తందనాలాడటానికి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు మునుగోడులో మకాం వేస్తున్నారని ఎద్దేవా చేశారు. విపక్షాల ఫోన్లను ట్యాపింగ్ చేసేందుకు ఇజ్రాయెల్ సంస్థతో కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారని, ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్ నేతలు బాహాటంగానే చెబుతున్నారని అన్నారు. ఇలాంటి నీచ బుద్ధి ఉన్న కేసీఆర్, బీజేపీపై విమర్శలు చేయడానికి సిగ్గుపడాలని అన్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ కలసి కుట్ర పన్నుతున్నాయని, కాంగ్రెస్ అభ్యర్థికి కేసీఆర్ ఆర్థిక సాయం చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు. మందు, మంది, మంత్రులతో మునుగోడు ఓటర్ల తీర్పును మార్చలేరని, బీజేపీ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ వరంగల్, హనుమకొండ జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, కొండేటి శ్రీధర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment